ArticlesNews

వందే వాల్మీకి కోకిలమ్

443views

( అక్టోబర్ 17 – వాల్మీకి జయంతి )

రామాయణం లేకుండా మన భారతదేశం మనలేదు అంటే అతిశయోక్తి కాదు. అటువంటి గొప్ప ముద్రని ఈ జాతి మీద వేసిన మహిమాన్వితుడు రాముడు. ఆ రాముడిని మనకు పరిచయం చేసిన మహనీయుడు శ్రీ వాల్మీకి మహర్షి. హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్విజ మాసం పౌర్ణమి నాడు మహర్షి వాల్మీకి జన్మించారు. ఈ సంవత్సరం వాల్మీకి జయంతిని అక్టోబరు 17న నిర్వహించుకుంటున్నాము. ఈ రోజున వాల్మీకి మహర్షిని స్మరించుకోవడం, రామాయణం చదవడం లేదా వినడం, శ్రీరాముడిని ప్రార్థించడం ద్వారా వాల్మీకి జయంతిని భారతీయులు పాటిస్తారు. సంస్కృత సాహిత్యంలో ఆదికవి అయిన వాల్మీకి రామాయణాన్ని 24,000 శ్లోకాలలో ఏడు కాండలుగా విరచించారు.

నిత్య జీవితంలో నీతినియమాలకు కట్టుబడకుండా, ధర్మనిరతితో ప్రవర్తించకుండా భగవంతుడికి దగ్గర కావాలనుకోవడం అవివేకం. ఆ విశ్వంభరుడికి విలువలతో కూడిన మన జీవన ప్రయాణమే ప్రామాణికం కాని కులగోత్రాలు కావు. అగ్రకులాన జన్మించినా అడ్డదారులు తొక్కితే ఆయన క్షమించడు. అంత్యజుడై పుట్టినా పావనుడై చరిస్తే చేకొనక మానడు. ఇందుకు మన ముందున్న చక్కని ఉదాహరణే వాల్మీకి మహర్షి. ఒక బోయవాడు మహర్షిగా మారి రామాయణ మహాగ్రంథమును రాసి భావితరాల వారికి అందించి భారతదేశ ఔన్నత్యాన్ని దశదిశలా చాటిన గొప్ప కవి వాల్మీకి. భారతదేశం వాల్మీకి దేశం-రామాయణ దేశం అని మాక్స్ ముల్లర్ మహాశయుడు కీర్తించాడు.

వాల్మీకి జీవితంలో గొప్ప సందేశం దాగుంది. ఆయన జీవితం మంచి లేదా చెడ్డ జన్మ లేదని బోధిస్తుంది. ఒకరి గొప్పదనం అనేది వారు చేసే పనులపైనే ఆధారపడి ఉంటుందనేందుకు వాల్మీకి జీవితమే ఒక నిదర్శనం. రామాయణంలోని ఉత్తరకాండలో మనకు వాల్మీకి పూర్వాశ్రమ జీవితం గురించి తెలుస్తుంది. ఆ కథనం ప్రకారం ఆయన ఒక బందిపోటు. ఒకసారి నారద మహర్షిని దోచుకోబోగా ఆయన ద్వారా ఆత్మసాక్షాత్కారం పొంది జీవిత సత్యాన్ని గ్రహిస్తాడు. నారదుల ద్వారా ఉపదేశం పొందిన దొంగ ఆ తర్వాత తాపసిగా మారి బ్రహ్మ కటాక్షంతో వాల్మీకిగా మరుజన్మ ఎత్తుతాడు. వల్మీకం అంటే పుట్ట. వల్మీకం నుంచి ఉద్భవించినవాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు. మహర్షి వాల్మీకిగా ఎదిగి మనోహరమైన రామాయణాన్ని రచించాడు.

రామాయణంలో మానవ ధర్మాలన్నిటి గురించి వాల్మీకి చక్కగా విశదపరిచారు. శిష్య ధర్మం, భాతృధర్మం, రాజధర్మం, పుత్రధర్మం, భృత్యు ధర్మం, ఇంకా పతివ్రతా ధర్మాలు, ప్రేమలూ, బంధాలు శరణాగత వత్సలత, యుద్ధనీతి, రాజనీతి, ప్రజాభ్యుదయం, సత్యవాక్య పరిపాలన, ఉపాసనా రహస్యాలు, సంభాషణా చతురత, జీవితం విలువలు, ధర్మాచరణ ఇలా అనేక రకాల ఉపదేశాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రామాయణ కావ్యంలో మంచి చెడుల గురించి చెప్పనిదంటూ ఏదీ లేదు.

రామాయణ కావ్యాన్ని మనకు అందించిన మహర్షి వాల్మీకి గొప్ప ఖగోళవేత్త. ఆయనకు ఖగోళ విజ్ఞానంపై ఉన్న పట్టు రామాయణ కావ్యంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రామాయణంలో పేర్కొన్న ఖగోళ విషయాలు, సందర్భాలు నూటికి నూరుపాళ్లు సరైనవని ఆధునిక శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ల ద్వారా తేల్చారు. మొత్తంగా, ఎంతో విలువైన సత్యాలను చెప్పి, ఎంతో మహత్తర కావ్యాన్ని అందించిన కవి వాల్మీకి మహర్షి వందనీయులు. ఆయనకు మనం చేతులెత్తి నమస్కరించాలి. ప్రతివారు, రామాయణ కావ్యం చదివి చక్కని గుణవంతులై శ్రీరాముని అనుగ్రహం పొందితే, వాల్మీకి మహర్షి ఋణం తీర్చుకున్నట్లే..