
( అక్టోబర్ 17 – మీరాబాయి జయంతి )
మధ్య యుగంలో భారతీయ సమాజాన్ని సంస్కరించి, అప్పటికి అమలులో ఉన్న మూఢ విశ్వాసాలను నిరసించిన ప్రయత్నాల్లో భక్తి ఉద్యమానికి విశేష ప్రాధాన్యం ఉంది. సంప్రదాయ వాదాన్ని, కుల వ్యవస్థను, వర్ణ విభేదాలను భక్తి ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకించారు. స్థానిక భాషల్లో, తేలికగా అర్థమయ్యే శైలిలో రచనలు, బోధనలు, పాటలు, భజనలతో మోక్ష సాధనకు భక్తి మార్గాన్ని తాము అవలంబించి… ప్రజలకు చాటిచెప్పారు. తమ భక్తి మార్గంతో మతాల మధ్య సామరస్యాన్ని పెంపొందించిన వారిలో శంకరాచార్యుడు, కబీర్, గురునానక్, తులసీదాస్, సూరదాస్, అన్నమయ్య వంటివారి జాబితాలో మీరాబాయికి కూడా విశేష స్థానం ఉంది. వీరంతా భగవంతుడిని కీర్తించి తరించినవారే.
రాధా దేవి అవతారంగా పరిగణించే మీరాబాయి గొప్ప సాధువుగా, హిందూ ఆధ్యాత్మిక కవయిత్రిగా, శ్రీకృష్ణుడి ప్రియ భక్తురాలిగా పేరొందింది, 200 మందికి పైగా భక్తుల జీవిత చరిత్రలను బ్రజ భాషలో సంక్షిప్తంగా అందించిన భక్తమాల అనే కవితలో ఆమె గురించి విశేషంగా ప్రస్తావించారు. భక్తి ఉద్యమకారుల్లో ఒకరైన మీరాబాయి జీవితానికి నేటికీ ఎంతో ప్రాధాన్యం ఉంది. మీరాబాయి కచ్చితంగా ఎప్పుడు జన్మించిందనే దానికి సంబంధించి ప్రామాణిక రికార్డులు అందుబాటులో లేవు. ఆమె 1498 లో రాజస్థాన్‌లోని సామంత రాజ్యం అయిన మేర్తాలో ఉన్న చౌకరి అనే గ్రామంలో జన్మించిందని చెబుతారు. ఆ రాజ్య పాలకుడు రావు దుడాజీ చిన్న కుమారుడు రతన్ సింగ్ రంథోర్ కుమార్తె మీరాబాబు. మొఘలులతో పోరాడుతూ ఆమె తండ్రి ఎక్కువ సమయం ఇంటికి దూరంగానే ఉండిపోయాడు. యుద్ధంలో పోరాడుతూ చిన్న వయసులోనే వీరమరణం పొందాడు. మీరాకు ఏడేళ్ళ వయసున్నప్పుడు ఆమె తల్లి కూడా మరణించింది. చిన్నతనంలో మీరాకు తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయతలు దాదాపు లభించలేదనే చెప్పాలి. తాత సంరక్షణలో పెరిగిన మీరా… ఆయన వద్దనే మతం, రాజకీయాలు, పాలనా పరమైన అంశాలను అవపోసన పట్టింది. సంగీతం, కళలను కూడా అభ్యసించింది.
మేర్తాకు చెందిన రంథోర్లు గొప్ప విష్ణు భక్తులు. వైష్ణవ సంప్రదాయాల మధ్య పెరగడం మీరా బాయిపై పెను ప్రభావం చూపించాయి. తన జీవితాన్ని ఆమె శ్రీకృష్ణుని పట్ల భక్తి మార్గంలో తీర్చిదిద్దడానికి దోహదపడ్డాయి. చిన్నప్పటి నుంచే మీరా శ్రీకృష్ణుని ఆరాధించడం నేర్చుకుంది. నాలుగేళ్ళ వయసులో ఒకసారి మీరా ఇంటి ముందు నుంచి పెళ్లి ఊరేగింపు వెళుతోంది. పెళ్లికొడుకు చక్కటి దుస్తులు ధరించి, బాగా ముస్తాబు చేసుకొని ఉన్నాడు. ఆ పెళ్ళికొడుకుని చూసిన మీరా అమాయకంగా తన తల్లితో అమ్మా, నా పెళ్ళికొడుకు ఎవరు అని ప్రశ్నించింది. మీరా తల్లి చిరునవ్వు నవ్వింది. శ్రీకృష్ణుని ప్రతిమ వైపు చూపిస్తూ, సరదాగా అడిగో… అతడే నీ పెళ్ళికొడుకు అంటూ ఆటపట్టించింది.
ఆ తర్వాత కొంతకాలానికి ఒక యోగి మీరా ఇంటికి వచ్చాడు. ఆయన వద్ద ఒక చక్కటి శ్రీకృష్ణుని విగ్రహం ఉంది. కోట వదిలి వెళ్ళే ముందు, ఆయన ఆ విగ్రహాన్ని మీరాకు అప్పగించాడు. నాటినుంచి బాల మీరా ఆ కృష్ణుడి విగ్రహాన్ని అమితంగా ప్రేమించడం ప్రారంభించింది. ఆ బొమ్మకు స్నానం చేయించడం, దుస్తులు వేయడంలోనే సమయం గడిపేది. ఆ విగ్రహాన్ని పూజించేది. దానితోనే నిద్రించేది. భక్తి పారవశ్యంతో ఆ బొమ్మ చుట్టూ నృత్యం చేసేది. పాటలు పాడేది. ఆ విగ్రహంతో మాట్లాడేది. తన భర్తకు సేవ చేసిన విధంగానే శ్రీకృష్ణుడి విగ్రహానికి సేవ చేయడం ప్రారంభించింది. కాలంతో పాటుగా మీరాకు తన ప్రభువు పట్ల భక్తి కూడా పెరిగిపోయిందితన భర్త కృష్ణుడే అని ఆమె మనస్ఫూర్తిగా నమ్మేది.
ఇంతలో మీరా తాతగారు మేవాడ్‌లోని చిత్తోడ్‌గఢ్‌కు చెందిన రాణా కుంభతో ఆమెకు వివాహం జరిపించారు. మీరా చాలా బాధ్యతాయుతమైన భార్యగా నడుచుకుంది. ఇంటి పనులన్నీ అయిపోయాక రోజూ శ్రీకృష్ణుని గుడికి వెళ్లి పూజలు చేసి, పాడుతూ, నృత్యం చేసేది. క్రమంగా మీరా తన ఆధ్యాత్మిక సాధనకు మరింత సమయం కేటాయించడం ప్రారంభించింది. ఆలయంలో కృష్ణుడి విగ్రహం ముందు గంటల తరబడి నృత్యాలు, పాటలు పాడటంతోనే కాలం గడిపేది. ఆమె పాటలు వినడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు, సామాన్య ప్రజలు పెద్దసంఖ్యలో తరలి వచ్చేవారు.
అ తర్వాత తన స్వామి నడయాడిన బృందావనానికి మీరా మకాం మార్చింది. ఆనంద పారవశ్యంతో శ్రీకృష్ణుడి ఎదుట ఆడి పాడింది. సన్యాసిని జీవితాన్ని గడుపుతూ, పద్యాలు రాస్తూ, ఇతర సాధువులతో చర్చలు సాగిస్తూ, కలసి ప్రవచనాలు చేస్తూ, భక్తులతో సంభాషిస్తూ కాలం గడిపేది. ద్వారకలో ఆమె తన చివరి రోజులను గడిపారు. ఇక్కడ 1547లో మీరాబాయి తన శరీరాన్ని వదిలి కృష్ణపరమాత్మ విగ్రహంలో ఐక్యమైపోయిందని చెబుతారు. సాధువు, తత్వవేత్త, ఆధ్యాత్మిక కవయిత్రి, సామాజిక సంస్కర్త కూడా అయిన మీరాబాయితో సరిపోల్చదగిన వారు లేరు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఎంతో ఉదాత్తమైన జీవనం గడిపారు. ఒక యువరాణి అయినా కూడా సుఖాలను, విలాసాలను తృణప్రాయంగా త్యజించింది. బదులుగా పేదరికం, త్యాగం, వైరాగ్య జీవితాన్ని ఎంచుకుంది. అనేక కష్టాలను ఓర్చుకొని ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించింది. తన జీవితంలో అనేక కఠిన పరీక్షలను ఎదుర్కొంది. తన సంకల్పాన్ని సాధించడానికి మొండిగా నిలబడింది. భారతదేశంలోని గొప్ప మహిళా సాధువులలో మీరాబాయిని ఒకరిగా పరిగణిస్తారు. ఆమె పాటలు ఇప్పటికీ జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నాయి. దసరా సమయంలో రాజస్థాన్ లో ఆమె పేరిట ఇప్పటికీ ఉత్సవాలు నిర్వహిస్తారు. భారతీయుల హృదయాల్లో నేటికీ ఆమె సజీవంగా ఉన్నారు.





