
దేవుడి మాన్యాలను ఫోర్జరీ చేసిన కేసులో పాండిచ్చేరి కరైకల్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ జాన్సన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కరైకల్ లోని శ్రీ పార్వతీశ్వర స్వామి దేవాలయం భూములను అక్రమంగా విక్రయించినట్లు తేలడంలో పోలీసులు దర్యాప్తు చేసి, అరెస్ట్ చేశారు. కరైకల్ జిల్లా కోవిల్ పత్తు రెవిన్యూ గ్రామంలో వున్న పార్వతీశ్వర స్వామి దేవాలయానికి చెందిన భూమి అమ్మకాలపై ఫిర్యాదులు రావడంతో ఈ అవినీతి వెలుగులోకి వచ్చింది. కొన్ని నివేదికల ప్రకారం ఆలయ భూమిని స్మార్ట్ సిటీలో భాగంగా నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC)కి, అలాగే పర్యాటక శాఖకు కేటాయించినట్లు తప్పుడు పత్రాలతో సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.అలాగే ఫోర్జరీ సంతకాలతో దేవాలయ భూమిని అనధికారికంగా విక్రయించారు. దీంతో దేవాలయ బోర్డులో తీవ్ర వివాదం రేగింది.
డిప్యూటీ కలెక్టర్ జాన్సన్ తన సంతకాన్ని, అధికారిక ముద్రను పత్రాలను నకిలీవి సృష్టించాడు. దీని తర్వాత కొనుగోలుదారులు చట్టబద్ధంగానే భూములను కొనుగోలు చేసినట్లు నమ్మించాడు. ఈ మేరకు నకిలీ పత్రాలను కూడా సృష్టించాడు. దీంతో సమస్య జటిలమైంది. దీంతో హిందూ మున్నాని అనే సంస్థ ఈ అవినీతిలో ప్రభుత్వం, రాజకీయ జోక్యం వుందంటూ జిల్లా కలెక్టర్ కి, పుదుచ్చేరి గవర్నర్ కి ఫిర్యాదు చేసింది. ఈ అవినీతిలో వున్న వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది.
దీంతో పుదుచ్చేరి పోలీసులు రంగంలోకి దిగి, విచారణ నిమిత్తం ప్రత్యేక బృందాలను నియమించి, విచారణ చేపట్టారు. ఫోర్జరీతో భూముల క్రయ విక్రయాలు జరిగినట్లు, మోసగించినట్లు తేలింది. దీంతో మధ్యవర్తులైన శివరామన్, తిరుమలై రాజన్ ను అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ అవినీతిలో ప్రధాన సూత్రధారి ఆనంద్ మాత్రం పరారీలో వున్నాడు.దీంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.




