
ఇంద్రకీలాద్రిపై దసరా రద్దీ కొనసాగుతోంది. శనివారం నుంచి మొదలైన భవానీ దీక్షదారుల తాకిడి మరింత పెరిగింది. పచ్చని చెట్లతో రమణీయంగా ఉండే ఇంద్రకీలాద్రి భవానీ దీక్షదారులతో ఎరుపురంగు పులుపుముకుంది. ఆర్టీసీ బస్సులు, రైళ్లు, సొంత వాహనాలతో పాటు కాలినడకన వేలాదిగా భవానీ భక్తులు కనకదుర్గమ్మ ఆలయం వైపు కదలివస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఎంతో భక్తిశ్రద్ధలతో రేయింబవళ్లు ప్రయాణించి మరీ వస్తోన్న వారితో దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పరిసరాలు సందడిగా మారాయి.
విజయవాడ నగరంలోని ప్రధాన రహదారుల్లో ఎక్కడ చూసినా భవానీమాలదారులే కనిపిస్తున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి కాళేశ్వరరావుమార్కెట్ పైవంతెన మీదుగా కెనాల్ బ్రిడ్జి మార్గంలో భవానీల సంఖ్య అధికంగా ఉండడంతో వాహనాల రాకపోకలను నియంత్రించారు. వీఎంసీ సమీపంలోని హోల్డింగ్ ఏరియాలోకి భవానీభక్తులను క్రమపద్ధతిలో పంపిస్తున్నారు. అక్కడి నుంచి రద్దీని పరిగణనలోకి తీసుకుని వినాయకుగుడిని ఆనుకుని ఉన్న మార్గంలోకి వెళ్లేలా చూస్తున్నారు. పున్నమిఘాట్, కుమ్మరిపాలెం, సితార కూడలి వైపు నుంచి భారీగా భవానీలు తరలివస్తుండడంతో వారిని కూడా ఓ క్రమపద్ధతిలోనే ఘాట్‌రోడ్డు క్యూలైన్‌లోకి పంపిస్తున్నారు. సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పోలీసులు నిశిత పరిశీలన, పర్యవేక్షణ చేస్తూ ఎక్కువ సేపు దీక్షాదారులు రోడ్లపై పడిగాపులు పడకుండా త్వరగా క్యూలైన్లోకి చేరేలా అప్పటికప్పుడు వ్యూహాలు రూపొందించి అమలు చేస్తున్నారు.
వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు కూడా భవానీమాల వేసుకున్న వారిలో ఉండడంతో వారి కోసం ప్రత్యేకంగా మజ్జిగ, పాలతోపాటు బిస్కెట్లను కూడా క్యూలైన్లలోనే అందిస్తున్నారు. తాగునీరు అందుబాటులో ఉంచారు. బయట ఎండ తీవ్రత.. క్యూలైన్లలో ఉక్కపోతగా ఉండడంతో భక్తులు సొమ్మసిల్లి పోకుండా తాగు నీరు సరఫరా చేస్తున్నారు. క్యూలైన్లకు అతి సమీపంలోనే వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. మూలానక్షత్రం రోజు మాదిరిగానే నిన్నటి నుంచి అన్ని రకాల దర్శనాలను రద్దు చేసి ఐదు వరుసలను ఉచితంగానే కొనసాగిస్తున్నారు. నిన్న దసరా ఉత్సవాల చివరి రోజున అలంకరించిన అపరాజితదేవి రాజరాజేశ్వరిదేవి రూపంలోనే దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ శ్రీరాం సత్యనారాయణ, దుర్గగుడి ఈవో రామరావు దగ్గరుండి భక్తులు త్వరగా దర్శనాలు చేసుకునేలా చూస్తున్నారు. అల్పాహారంతోపాటు అన్నప్రసాదాన్ని కూడా భవానీలకు అందిస్తున్నారు.




