
288views
శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలోని అంగూరు గ్రామంలో గల కుంభేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పురాతన రాతి విగ్రహాలను పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగి రెడ్డి గుర్తించారు. ఇటీవల పర్యాటకాధికారి నారాయణరావు సారవకోట, జలుమూరు మండలాలలోని ఆలయాలు, ప్రదేశాలను సందర్శించిన సమయంలో అంగూరులో ఈ విగ్రహాలను గుర్తించారు. ఈయనిచ్చిన సమాచారం మేరకు శివనాగిరెడ్డి విగ్రహాలను పరిశీలించగా అరుదైన బ్రహ్మీ విగ్రహంగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. తూర్పు గాంగుల కాలంలో జనాదరణ చవిచూసిన సప్తమాతృకారాధనను సూచిస్తున్నాయన్నారు. ఈ బ్రహ్మి విగ్రహం సరస్వతీదేవి రూపాన్ని ప్రతిబింబిస్తూ వీణను మీటుతూ హంసవాహినిగా ఉందని వివరించారు. ఈ విగ్రహాలు వేయి ఏళ్ల కిందటివి అయి ఉంటాయని తెలిపారు.





