ArticlesNews

విజయాలను చేకూర్చే విజయదశమి

329views

( అక్టోబర్ 12 – విజ‌య‌ద‌శ‌మి ) 

ఈ సృష్టిలో మంచి, చెడుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ అనివార్యం. వాటి మ‌ధ్య నిరంత‌రం జ‌రిగే యుద్ధంలో చివ‌ర‌కు మంచికే విజ‌యం ల‌భిస్తుంది. దానికి ప్ర‌తీక‌గా మ‌నం జ‌రుపుకొనే పండుగే విజ‌య‌ద‌శ‌మి. ఆధ్యాత్మిక సాధ‌న‌లు మొద‌లు లౌకిక‌మైన ప్ర‌యోజ‌నాల‌ను ఇచ్చే ఏ కొత్త ప‌నికైనా శ్రీ‌కారం చుట్ట‌డానికి ద‌స‌రా రోజులు ప్ర‌శ‌స్త‌మైన‌వి. విజయదశమి దుర్గామాతకు చాలా ప్రియమైన‌ది. దుర్గ అంటే దుర్గతులను నశింపజేసేది అని అర్థం.

విజ‌యద‌శ‌మిని ద‌స‌రా అని కూడా పిలుస్తారు. అంటే పది జన్మల పాపాలను నశింపజేస్తుంది కాబట్టి ద‌శ‌హ‌రా అని పేరు వ‌చ్చింది. కాల‌క్ర‌మంలో అదే ద‌స‌రాగా మారింది. దాన‌వ‌త్వంపై మాన‌వ‌త్వం విజ‌యం సాధించిన రోజే ద‌స‌రా. ఈ పండుగ రోజు సాయంత్రం రావ‌ణ‌, కుంభ‌క‌ర్ణుల దిష్టిబొమ్మ‌ల‌ను ద‌హ‌నం చేసే సంప్ర‌దాయం ఉంది. దుష్ట సంహారం ద్వారా ధ‌ర్మాన్ని నిల‌ప‌డ‌మే ఈ వేడుక‌ల్లోని ప‌ర‌మార్థం. ఈ పండుగ రోజున ప్ర‌కృతిలో అప‌రాజితా శ‌క్తి ఆవహించి ఉంటుంద‌ని, ఆ శ‌క్తిని పూజించ‌డం వల్ల ప‌రాజ‌యం ఉండ‌ద‌ని, మోక్షం ల‌భిస్తుంద‌ని విశ్వాసం. అప‌రాజితా దేవి పూజ త‌ర్వాత పాల‌పిట్ట‌ను ద‌ర్శించుకోవ‌డం సంప్ర‌దాయం. పాల పిట్ట‌కు నీళ్లంటే స‌రిప‌డ‌దు. అందుకే వ‌ర్ష రుతువు ముగిసిన త‌ర్వాతే ఇది బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఈ సృష్టిలో ఉన్న ప‌శుప‌క్ష్యాదుల‌ను కూడా ప్రేమించాల‌న్న గొప్ప భావం ఇందులో ఇమిడి ఉంది.

ఆశ్వీయుజ మాసం శుక్ల ప‌క్షంలో ద‌శ‌మీ తిథి నాడు సాయం సంధ్య వేళ న‌క్ష‌త్రాలు ద‌ర్శ‌న‌మ‌య్యే స‌మ‌యానికి విజయం అనే ముహూర్తం ఉంటుంద‌ని, ఆ స‌మ‌యంలో శ‌మీ వృక్షాన్ని పూజిస్తే స‌క‌ల విజ‌యాలు క‌లుగుతాయ‌ని శాస్త్రాలు చెబుతున్నాయి. జ‌మ్మిచెట్టు శ‌త్రువుల‌ను త‌రిమికొట్ట‌డంతో పాటు పాపాల‌ను తొల‌గిస్తుంది అని విశ్వాసం. ఈ కార‌ణంగానే పూర్వ‌కాలంలో రాజులు జైత్ర‌యాత్ర‌ల‌కు ఈ ముహూర్తంలోనే బ‌య‌లుదేరేవారు. సర్వ మానవ సౌభ్రాతృత్వ ఆలోచనలు అంద‌రిలోనూ క‌ల‌గాల‌ని చైతన్య ప్రతీక అయిన జగన్మాతను కోరుకుంటూ శమీవృక్షం ఆకులను సేకరించి పెద్దల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం పొందుతారు. శమీవృక్షం అగ్నికి ప్రతీక. ఔషద గుణాలు ఉన్నాయి కనుకనే పూర్వీకులు ఈ చెట్టును విజయదశమి నాడు పూజించేవారు. అదే ఆచారం నేటికీ కొనసాగుతోంది.

శ‌ర‌దృతువు ప్ర‌స‌న్న‌త‌కు నిల‌యం. అప్ప‌టి వ‌ర‌కూ వ‌ర్షాల‌తో చిత్తడిగా మారిన నేల ఈ మాసం ప్రారంభం నుంచి ఎండిపోయి నిర్మ‌లంగా మార‌తాయి. జ‌లాశ‌యాల‌న్నీ నిండుగా నీటితో క‌ళ‌కళ‌లాడుతూ ఉంటాయి. శ‌ర‌త్కాలంలో దిన‌దిన ప్ర‌వ‌ర్థమానంగా పెరిగే చంద్రుడి క‌ళ‌లు మ‌నిషిలో ఆనందోత్సాహాల‌ను నింపుతాయి. ప్ర‌తి పండుగ వెనుక సామాజిక‌, పార‌మార్థిక నేప‌థ్యం ఉంటుంది. మ‌నిషి జీవించినంత కాలం తాను, తన కుటుంబంతో పాటు స‌మాజం అభ్యుద‌యాన్ని కాక్షించాల‌ని, అంద‌రూ క్షేమంగా ఉండాల‌ని భావించే స‌త్సంప్ర‌దాయానికి ఈ ద‌స‌రా పండుగ నాంది ప‌ల‌కాలి.