
( విజయదశమి – రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవం )
విజయదశమి..విజయానికి సంకేతంగా పండుగ జరుపుకునే రోజు. అధర్మం పై ధర్మం, రాక్షస శక్తి పై దైవీశక్తి, చెడు పై మంచి పోరాడి విజయం పొందిన రోజు. అందుకే అది విజయానికి సంకేతమైన రోజు. విజయదశమి రోజు ఏ పని ప్రారంభించినా విజయాన్ని పొందడం ఖాయమని ప్రజల ప్రగాఢ విశ్వాసం. అందుకే గతంలో దేశ స్వాతంత్ర్య పోరాటం కోసం జాతీయ నాయకులు దుర్గామాత పూజలను వేదికగా చేసుకొని ప్రజా చైతన్యాన్ని, సమైక్యతాశక్తిని సాధించారు. ఎన్నో విజయాలతో ముడిపడి ఉన్న విజయ దశమి నాడే ‘‘విధాయాస్య ధర్మస్య సంరక్షణమ్’’ అనే ఉద్దేశ్యంతో పరమ పూజనీయ డాక్టర్ కేశవరావ్ బలిరామ్ హెడ్గేవార్ గారు 1925వ సంవత్సరంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను స్థాపించారు. సంపూర్ణ హిందూ సమాజ సంఘటనా శక్తి ఆధారంగా లక్ష్య ప్రాప్తి జరగాలని డాక్టర్ హెడ్గేవార్ గారి ఆకాంక్ష. దీని కోసమే శాఖా పద్ధతిని రూపకల్పన చేశారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావము, నిరంతర అభివృద్ధి..ఇవి 20వ శతాబ్దంలో భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టం. సంఘ్ ఆసేతుహిమాచలం విస్తరించి తన ప్రాముఖ్యతను చాటుకోవడమే కాక విదేశాల్లో కూడా గుర్తింపు తెచ్చుకుంది. సూర్యుని తేజస్సు నలు దిశలా ప్రసరించినట్లు సంఘ్ నుంచి సంఘ్ ఆశయాల నుంచి స్ఫూర్తి పొంది అనేక సంస్థలు ఆవిర్భవించాయి. సామాజిక, సాంస్కృతిక, విద్య, రాజకీయవంటి అనేక రంగాలలో జాతీయ భావనలు నరనరాన జీర్ణించుకొన్న సంస్థలు తమ ప్రత్యేకతను చాటుతూ ఉన్నాయి. ఒక విత్తనం నుంచి శాఖోపశాఖలు గల మహావృక్షం అవతరించినట్లు 99 సంవత్సరాల క్రితం నాగపూర్‌లో ఒక మారుమూల ప్రాంతంలో మొదలైన సంఘ్‌కు ఇప్పుడు దేశవ్యాప్తంగా 73 వేలకు పైగా రోజువారీ శాఖలు ఉన్నాయి. సంఘ్ వ్యతిరేకులు దీనిని 1948, 1975, 1992లో మొత్తం మూడు సార్లు నిషేధించినా మునుపటి కంటే బలంగా ఉద్భవిస్తూ వచ్చింది. 2025 విజయదశమి నాటికి దేశంలోని అన్ని గ్రామీణ ప్రాంతాలు మరియు పట్టణ ప్రాంతాల్లోని అన్ని మండలాల్లో తన కార్యకలాపాలతో పాటు రోజువారి శాఖలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ రోజు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందుతోంది. సంఘ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి సహకరిస్తున్నవాళ్లు దేశమంతా కనపడుతున్నారు. యువత సైతం సంఘ్‌లో చేరేందుకు ఆకాంక్షిస్తున్నారు. సంఘ్ కార్యవిస్తరణలో యాత్రలో నాలుగు దశలు ఉన్నాయి. సంఘ్ స్థాపన నుంచి స్వాతంత్ర్యం వచ్చే వరకు మొదటి దశ కాగా రెండవ దశలో భారతదేశపు శాశ్వతమైన జాతీయ దృక్పథానికి ప్రభావితమై విద్య, విద్యార్థి, రాజకీయం, కార్మికులు, వనవాసీ సమాజం, వ్యవసాయం తదితర రంగాల్లో వివిధ సంస్థలు ఆవిర్భవించాయి. సమాజంలో వంచితులు, వెనుకబడిన వర్గాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా 1990లో సేవా విభాగ్ ప్రారంభం అయింది. సంఘ్ భావజాలం, కార్యకలాపాల గురించి సమచారాన్ని చేర వేసే దిశగా 1994లో సంపర్క్ విభాగ్ ఆరంభం అయింది. అదే సంవత్సరం ప్రచార విభాగ్ ఆరంభం అయింది. సేవ, సంపర్క్, ప్రచార్ ఈ మూడు విభాగాలు సుదూర ప్రాంతాల ప్రజలకు సంఘ్‌ను చేర్చడం ద్వారా సమాజాన్ని మేల్కొలిపే కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. ఇక ఇదే సమయంలో ధర్మ జాగరణ విభాగ్, గ్రామ్ వికాస్, గోసేవ – గో సంవర్ధన్, సామాజిక్ సద్భావ్, సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్, పర్యావరణ సంరక్షణ వంటి కార్యక్రమాలను స్వయంసేవకులు గతివిధి పేరుతో సమాజంలో చేపడుతున్నారు. ప్రస్తుతం సంఘ్ కార్యకలాపాల అభివృద్ధి యాత్ర ‘నాల్గవ దశ’ సాగుతోంది.
సమాజసేవకు ‘శాఖా పద్ధతి’ ఒక జగన్నాథ రథం వంటిది. అందరూ కలిసి లాగడం ప్రారంభించిన తర్వాత ఎవరూ దానిని ఆపలేరు. సమాజపు అవసరాలను గుర్తించడమే కాక స్పందించే గుణాన్ని ఆర్.ఎస్.ఎస్. కలిగి ఉంది. అందుకే ఆర్.ఎస్.ఎస్. సామాన్య ప్రజల సంస్థగా తయారుకాగలిగింది. ఒకరి నుంచి మరొకరికి దేశంలో చాలా సహజంగా వేగంగా విస్తరించింది. సాధారణ ప్రజలకు అర్థమయ్యే సామాన్య అంశాలు, అవసరమైన విలువల గురించే సంఘ్ ఆలోచిస్తుంది. అందుకే ఒక్కసారి సంఘ్‌లో చేరిన వ్యక్తి తన జీవితాంతం స్వయంసేవక్‌గా మిగిలిపోవాలని కోరుకుంటాడు. సంఘ్ ఆలోచన ప్రకారం హిందూ అనే శబ్దం ఏ మతానికీ సంబంధించినది కాదు. అది భారత జాతీయతకు సంబంధించినది. అది అందరినీ కలుపుకుని పోయేది. అన్నివర్గాల వారిని, అన్ని విశ్వాసాల వారిని ఒక ఆత్మీయ ఆలింగనంలో కలిపి ఉంచే ఒక మహత్తర శబ్దం. సంఘ్ ఆకస్మిక, యాదృచ్ఛిక మార్పులు విశ్వసించదు. అందుకే సంఘ్ కార్యకలాపాలన్నీ ప్రణాళికాబద్ధంగా, అనుభవంతో కూడిన మార్గదర్శనంతో, విశ్వాసంతో, వాస్తవిక ఆచరణాత్మక విధానంతో కూడి ఉంటాయి. భారతదేశం పరమవైభవంతో పాటు విశ్వకల్యాణం కూడా ఆర్.ఎస్.ఎస్. లక్ష్యం. ఈ మహత్తర కార్యంలో అందరూ తమ వంతు చేయూతనిచ్చి సంపూర్ణ శక్తితో పని చేయాల్సిన సమయం ఇది. అలా చేస్తారు, చేయాలన్నదే ఈ విజయదశమి సందేశం.





