ArticlesNews

శరన్నవరాత్రుల అంతరార్థం

448views

(విజయదశమి ప్రత్యేకం )

హిందువుల పర్వదినాలలో ముఖ్యమైనది దసరా పండుగ. దీనినే శరన్నవరాత్రులని, శారదా నవరాత్రులని వ్యవహరిస్తారు. శరన్నవరాత్రులు అంటే శరత్కాలంలోని తొమ్మిది రాత్రులు అని అర్థం. ఈ నవరాత్రులు శరదృతువులో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు విజయదశమి వరకు జరుగుతాయి. ఈ తొమ్మిది రోజులూ శ్రీ లలితా పరమేశ్వరీ దేవతకు ఆవరణ పూజలు, హోమం మొదలగు ప్రక్రియలను అనుసరించి ఆరాధిస్తారు. శ్రీ లలితాపరదేవత ఈ నవరాత్రులలో అహోరాత్రాలు పోరాడి శుంభనిశుంభ, మహిషాసురాది రాక్షస సంహారం చేసి లోకాలను పాపపంకిల రహితంగా చేసినట్లు శ్రీదేవీపరమైన గ్రంథాలలో ఉంది.

‘నవరాత్రులు’ అంటే ఏమిటి, నవ అనగా తొమ్మిది. రాత్రి అంటే సర్వజీవకోటి స్వవ్యాపార రహితమై ఉపరమణము చెందు కాలవిశేషం. ఇక్కడ నవరాత్రి అనే శబ్దాన్ని బట్టి తొమ్మిది సంఖ్య గలవానికి రాత్రి అని అర్థం చెప్పాలి. మానవునికి జ్ఞానేంద్రియ పంచకం…అంటే శ్రోత్రం (చెవి) త్వక్కు (చర్మము) చక్షు (కన్ను) జిహ్వ (నాలుక) నాసిక (ముక్కులు)లు అంతఃకరణ చతుష్టయం.. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం.. మొత్తం తొమ్మిది. ఇవి వాటివాటి వ్యాపారములను త్యజించి ఉపరమణము చెందడమే నవరాత్రి. ఈ విధముగా ఒక మనిషికి ఈ తొమ్మిది ఇంద్రియాలు ఉపరిమణము చెందితే మిగిలేది కేవలం స్వాఖండ సచ్చిదానంద స్వరూపం. ఇది కేవలం అభ్యాససాధ్యం కాని అన్యం కాబోదు. ఈ ఇంద్రియ వ్యాపార నిగ్రహమునకు చిహ్నంగా
నవరాత్రులు కల్పితమైనట్లు కనబడుచున్నది.

నవరాత్ర వ్రతం ఆచరించి ‘కుండలినీ’ అను పేర వ్యవహరించే పరమేశ్వరీ అనుగ్రహానికి పాత్రుడై జీవుడు తన దేహంలో ఉన్న ఆ కుండలి శక్తిని ప్రేరణచేసి యోగభూములను ఆరోహిస్తూ, చివరకు అఖండానంద స్వరూవుడైన వరమాత్మను పొందుతాడు.ఈ పరమేశ్వరీ శక్తి తొమ్మిది రోజులు రాక్షసులతో యుద్ధం చేసి తొమ్మిదవ రోజైన మహర్నవమి నాడు అహంకార చిహ్నం, అజ్ఞాన స్వరూవుడు మహిషాసురుని వధించి ‘మహిషాసురమర్దని’ అనే నామంతో విరాజిల్లుతున్నది. విజయానికి గుర్తుగా ఆ మరునాడు ‘విజయదశమి’. అంటే విజయ వంతమైన దశమి అని పేరు. భారతంలో పాండవులు అజ్ఞాతవాసానంతరం ఉత్తర గోగ్రహణ సమయంలో విజయదశమినాడే శమీ వృక్షానికి పూజచేసి ఆ వృక్షంపై ఉంచిన ఆయుధములను ధరించి పార్థుడు కురు సేనను ఎదుర్కొని విజయం సాధించినట్లు పేర్కొన్న కథ సర్వజన విదితమే. నవరాత్రి వ్రతం ఆచరించి దశమి నాడు ‘శమీపూజ’ చేసే ఆచారం ఈనాటికీ ఉంది.

ఇక ఉత్తర హిందూ దేశంలో ఈ పండుగలలో శ్రీరామమూర్తిని ఆరాధించడం ఉంది. శ్రీరాముడంటే కేవలం అపరదేవతా స్వరూపుడు, పరదేవతను ఆరాధించిన అవతారమూర్తి. ఉత్తర హిందూస్థానంలో దీనినే దనరా అని వ్యవహరిస్తూ, సుప్రసిద్ధమయిన “రామలీల” నృత్యాలు చేస్తారు. చివరిరోజున రావణాసురుని (దశకంఠుడు) ద్యోతకం చేసే ఒక పెద్ద విగ్రహాన్ని నిర్మించి దానిని కాల్చి భస్మీపటలం చేస్తారు. ఇక్కడ, దశకంఠుడు అనగా పదితలలు కలవాడు. పంచ మహాపాతకాలు, ఉపపాతకాలు కలసి మొత్తం పది. ఈ పాతకాలను సూచించేవే పది తలలు. అధర్మ నిర్మూలన, ధర్మ ప్రతిష్టాపనకు బద్దకంకణుడైన శ్రీమన్నారాయణుడు ఈ పదితలల రాక్షసుని సంహరించి ధర్మప్రతిష్ఠాపన చేశాడు. దీనికే దశహర అనగా పది నివారించినవాడు అని అర్ధం. ‘దశహర’ అను శబ్దమే వాడుకలో దసరా అయినట్లు అగపడుతోంది. ప్రాయశః ఈ అర్థాన్ని అనుసరించే ఉత్తర దేశంలో రామలీల మొదలగునవి నిర్వహిస్తున్నారు.

భారతకథను అనుసరించి హిందూరాజులు నవరాత్రులలోని చివరి మూడు రోజులలో తమ ఆయుధాలకు పూజలు చేయడం ఆచారంగా ఉంది. దీనిని పురస్కరించుకొనే ఈనాడు కూడా చివరి మూడురోజులకు “ఆయుధపూజ” అను పేర వ్యవహారంలో ఉంది.
విజయవాడ మొదలగు పట్టణములలో దశమి మొదలుకొని రెండు మూడు రోజులపాటు విశేషంగా శ్రీ దుర్గాదేవి, శ్రీరామచంద్రమూర్తి చరిత్రలను చిత్రించు వేషాలు ధరించి ప్రజలకు ఈ మహ నీయులను జ్ఞాపకం చేస్తుంటారు.

ఏ విధముగ అన్వయించినా, మానవులు ఈ నవరాత్ర వ్రతం ఆచరించి తమ పాపాలన్నిటినీ కడిగివేసుకొని శ్రీవరమేశ్వరీ కటాక్ష పాత్రులై విశ్వకల్యాణాకి ప్రయత్నించాలి. సర్వాభీష్ట ప్రదాయిని శ్రీ లలితాంబిక అందరిని రక్షించుగాక!.