
( అక్టోబర్ 12 – విజయదశమి ప్రత్యేకం )
దేశంలోని అష్టాదశ పీఠాలు సహా అనేకానేక శక్తిక్షేత్రాలలో శ్రీ ప్లవనామ సంవత్సర ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి దేవీ నవరాత్రుల ఉత్సవాలు కొనసాగుతున్నాయి. నవరాత్రులలో ప్రధాన ఘట్టాలు సరస్వతీపూజ, దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి, శమీపూజలను జరుపుకుంటారు. కొవిడ్ మహమ్మారి మూడవ దశ పొంచి ఉందన్న హెచ్చరికలతో ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు తగు జాగ్రత్తల మధ్య పూజాదికాలు నిర్వహిస్తున్నారు. ఊరూవాడా మహిళలు ఒక్కచోట చేరి జరుపుకునే బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలు సీదాసాదాగానే సాగుతున్నాయి.
ఆశ్వయుజ శుక్ల దశమిని విజయదశమి లేదా ‘దసరా’ అనీ అంటారు. దశవిధ పాపాలను హరించేది కనుక ‘దశహరా’అని, కాలక్రమంలో ‘దసరా’గా వాడుకలోకి వచ్చిందని పెద్దలు చెబుతారు. ఇది దుష్టశిక్షణకు, శిష్ట రక్షణకు ప్రతీక. లోకకంటకుల పట్ల రౌద్రం ప్రదర్శించిన జగన్మాత నమ్మిన వారికి కొంగు బంగారమై కరుణ కురిపిస్తూ ‘అమ్మలగన్న అమ్మ’గా పూజలందుకుంటోంది. శ్రవణానక్షత్రంతో కూడిన ఆశ్వయుజ శుక్ల దశమినాడే ‘విజయ’ ముహూర్తం వస్తుందని, ఆ రోజునే క్షీరసాగర మధనం జరిగి అమృతం ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి.
విజయదశమి
అసురత్వం (రాక్షసత్వం)పై దైవత్వం, చెడు మీద మంచి సాధించిన రోజు విజయదశమి. శ్రవణా నక్షత్రంతో కూడిన ఆశ్వయుజ శుక్ల దశమినాడే క్షీరసాగర మధనంలో అమృతం ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. దేవాసుర సమరంలో పరాజితులైన దేవతలు శరన్నరాత్రులలో ఇష్ట దేవతలను అర్చించి దశమినాడు విజయు లయ్యారట. పాండవుల అజ్ఞాతవాస ఆరంభం, ముగింపు ఈ రోజుననే అని మహాభారతం పేర్కొంటోంది. రాజులు తమ విజయయాత్రలకు ఈ ‘దశమి’నే ముహూర్తంగా నిర్ణయించేవారట. దుర్గాదేవికి గల అనేక నామాలలో ‘అపరాజిత’ (పరాజయం లేనిది) ఒకటి. ఆమె విజయానికి అధిదేవత. విజయదశమి నాడు ఆమెను ఆరాధిస్తే జయం కలుగుతుందని విశ్వాసం. ‘దశమి’నాడు కనకదుర్గమ్మ వారు రాజరాజేశ్వరీదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. అమ్మవారిని ఈ అలంకారంలో దర్శిస్తే సకల శుభాలు, విజయాలు సిద్ధిస్తాయని విశ్వాసం. ఆ రోజ సాయం సమయంలో చుక్కలు పొడిచే సమయానికి ‘విజయ ముహూర్తం’ అని పేరు. ఆ సమయంలో ప్రారంభించే పనులు విజయవంత మవుతాయని, అందుకే ఆ రోజుకు విజయదశమి అని పేరు వచ్చిందని చెబుతారు. విద్యాభ్యాసం ఆరంభం సహా సకల శుభకార్యాలకు దీనిని శుభ సమయంగా భావిస్తారు. ఆనాడు ఆయుధపూజ నిర్వహిస్తారు. వేదపండితులతో వేదపారాయణం చేయించేవారు. దీనినే ‘వేదసభ’ అంటారు.
కోల్‌కతాలోని కాళీఘాట్ ప్రాంతంలోని కాళీ ఆలయంలో (కలకత్తా కాళీ), దక్షిణేశ్వర్ ప్రాంతంలో హుగ్లీ నదీతీరంలోని కాళీమాత (భవతారిణి మాత) ఆలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగు తాయి. రావణునితో యుద్ధంలో రాముడి విజయానికి చిహ్నంగా ‘రామ్‌లీలా’ పేరిట ఉత్తరాదిలో రావణ దహన ఘట్టాన్ని అట్టహాసంగా నిర్వహిస్తారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని పరవురామే శ్వర ఆలయంలో లభించిన క్రీ.శ. ఆరవ శతాబ్దం నాటి శిల్పం ఆధారంగా దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహించే వారని తెలుస్తోంది. బెంగాల్, అస్సోం రాష్ట్రాలలో తమ ఆడపడుచు పార్వతీదేవి పుట్టింటికి వచ్చినట్లుగా భావించి పండుగ జరుపుకుంటారు. గుజరాత్‌లో దాండియా నృత్యం చేయడం సంప్రదాయం. శ్రీకృష్ణుడి కోడలు ఉష (అనిరుద్ధుని భార్య) ఈ నాట్యాన్ని ప్రవేశపెట్టిందని అక్కడి వారి విశ్వాసం. శ్రీకృష్ణుని లీలలు, ఆదిపరాశక్తి గాథలను ఆలపిస్తూ నృత్యం చేస్తారు.
ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధప్రదేశ్‌లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కృష్ణానదిలో అమ్మవారికి తెప్పోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. శ్రీశైలంలో భ్రమరాంబదేవికి, తెలంగాణలోని అలంపురం జోగులాంబదేవి, వరంగల్‌లోని భద్రకాళికాదేవి తదితర ఆలయాలలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు.
శమీ పూజ
‘శమీ’ అంటే పాపాలను, శత్రువులను నశింప చేసేది అని అర్థం. శమీ (జమ్మి) వృక్షంలో అపరాజితాదేవి కొలువై ఉంటుందని విశ్వాసం. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన వాటిలో ఇదీ ఒకటి. శమీవృక్షాన్ని పూజించడం విజయదశమి నాటి మరో విశేష కార్యక్రమమని, జమ్మికొమ్మ లేదా సమిధకు ప్రదక్షిణ చేస్తే తొమ్మిది రోజుల పూజలో లోపాలు ఉంటే పరిహారమవుతాయని, దశమినాడు జమ్మిచెట్టును పూజించడం వల్ల లక్షీదేవి ప్రసన్న మవుతుందని విశ్వాసం. విజయదశమి నాడు ఈ వృక్షం వద్ద అపరాజితా దేవిని పూజించి ‘శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ/అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ’ అని ప్రదక్షిణలు చేస్తే శనిదోషాలు తొలగిపోతాయని చెబుతారు. రావణవధకు ముందు శ్రీరామచంద్రుడు అపరాజితా దేవిని, శమీవృక్షాన్ని అర్చించాడట. అజ్ఞాతవాసం కాలంలో పాండవులు ధనుర్బాణాలను శమీవృక్షం పైనే భద్రరపరిచారు. జమ్మి ఆకులను పవిత్రంగా భావించి పెద్దలకు ఇచ్చి ఆశీస్సులు పొందడం, బంధుమిత్రులకు, ఆత్మీయులకు ఇచ్చి శుభాకాంక్షలు తెలపడం ఆనవాయితీ. ఈ ఆకులను ‘బంగారం’ అనీ వ్యవహరిస్తారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ఈ సంప్రదాయం ఇప్పటికీ కనిపిస్తుంది.
పాలపిట్ట దర్శనం దసరా పండుగలో మరో ప్రాధాన్యం గల అంశం. పాలపిట్టను భక్తిప్రపత్తులతో చూస్తారు. పాండవులు వనవాస, అజ్ఞాతవాసాలు ముగించుకొని తిరిగి వస్తుండగా దాని దర్శనమైందని, అప్పటి నుంచి విజయాలు వరించాయని జానపద గాథలు ఉన్నాయి. అప్పటి నుంచి ఈ పండుగనాడు ఆ పక్షి దర్శనాన్ని శుభసూచకంగా భావిస్తారు. తెలంగాణ సహా ఒడిశా, కర్ణాటక, బిహార్‌ల రాష్ట్ర పక్షి పాలపిట్ట కావడం గమనార్హం.





