News

తిరుమలకు శృంగేరి జగద్గురువులు, దక్షిణాది పర్యటన ఖరారు…

20views

శృంగేరిపీఠం జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామివారు దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల్లో సుమారు 40 రోజుల పాటు పర్యటించనున్నారు.17.10.2024 నుంచి 27.11.2024 వరకు స్వామివారి పర్యటన కొనసాగనుంది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రజలకు దిశానిర్దేశం చేయడంతో పాటు అనుగ్రహభాషణం చేయనున్నారు. స్వామి వారు తన పర్యటనలో భాగంగా తిరుమలకు రానున్నారు. ఏడుకొండలపై రెండు రోజుల పాటు బస చేయనున్నట్లు ప్రకటనలో శృంగేరి శారదాపీఠం అధికారులు పేర్కొన్నారు.

శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామి వారి పర్యటన 17.10.2024న శృంగేరిలో ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి హస్సన్ జిల్లా పరిధిలోని చిన్నరాయపట్నం చేరుకుంటుంది. మరుసటి రోజు తుముకూరు జిల్లాలోని ముధుగిరిలో పర్యటించి భక్తులను అనుగ్రహిస్తారు.

19 వ తేదీన బెంగళూరుకు వెళతారు. 20 వ తేదీన బెంగళూరు శంకరపురం శ్రీ శృంగేరి శంకర మఠంలో బస చేస్తారు. 26 వ తేదీ సాయంత్రానికి కర్ణాటక పర్యటన ముగించుకుని తమిళనాడులోని కాంచీపురం చేరుకుంటారు. 27న కాంచీపురంలోని శ్రీ శృంగేరీ శంకర మఠంలో రాత్రికి నిద్ర చేస్తారు. ఆ తర్వాత షెడ్యూల్ లో భాగంగా చెన్నై పర్యటన కొనసాగనుంది. 13-11-2024న చెన్నై నుంచి తిరుపతి లో అడుగుపెడతారు. 14న తిరుమలలోని శ్రీ శృంగేరి మఠంలో విశ్రాంతి తీసుకుంటారు. 15, 16 తేదీల్లో తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి లో పర్యటించి అక్కడి నుంచి 16 వ తేదీ సాయంత్రానికి నెల్లూరు చేరుకుంటారు.

18, 19 తేదీల్లో విజయవాడ సత్యనారాయణపురం శివరామకృష్ణ క్షేత్రంలో బస చేస్తారు. 20 నుంచి 24 వరకు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో స్వామి వారు పర్యటించి భక్తులను అనుగ్రహిస్తారు. సనాతన ధర్మ రక్షణకు మార్గనిర్దేశం చేయనున్నారు.

గుంటూరు పర్యటన తర్వాత తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్ళనున్నారు. 25న గుంటూరు నుంచి గుడిమెల్లంక చేరుకుని ఆ రోజు రాత్రికి అక్కడే బస చేస్తారు. 27తో ఏపీ పర్యటన ముగించుకుని ఆ రోజే శృంగేరికి పయనం అవుతారు.

సనాతన ధర్మ పరిరక్షణ కోసం జగద్గురువు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు స్థాపించిన నాలుగు ఆమ్నాయ పీఠాలలో శృంగేరి ఒకటి. ఈ పీఠం కర్నాటకలోని చిక్‌మగళూరు జిల్లాలో ఉంది. దీనికి పీఠాధిపతులుగా జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామీజీ, ఉత్తరాధికారిగా శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామి ఉన్నారు .