పొరుగు దేశం పాకిస్తాన్ సాగిస్తున్న దుశ్చర్యలకు పలుమార్లు భారత్ నష్టపోవాల్సి వచ్చింది. పాక్ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ, ఉగ్రదాడులకు కుట్ర పన్నుతూనే ఉన్నారు. 2016, సెప్టెంబర్ 18న కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉరీలో భారత సైనికులపై పాక్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 18 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటన తరువాత భారత జవాన్లు పాక్ ఉగ్రవాదులకు ఇచ్చిన సమాధానం ఇప్పటికీ వారి చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటుంది.
పాక్ ఉగ్రవాదులు ఉరీలో దాడి చేసి పది రోజుల తర్వాత అంటే 2016, సెప్టెంబర్ 18న భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ నిర్వహించి, పాక్‌పై తగిన ప్రతీకారం తీర్చుకుంది. జమ్ముకశ్మీర్‌లోని ఉరీలో భారత సైన్యం క్యాంపుపై దాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నారు. జైషే మహ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు భారత ఆర్మీ క్యాంపులోకి ప్రవేశించి, విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. భారత సైనికులు నిద్రిస్తున్న గుడారాలకు నిప్పు పెట్టారు. ఈ దాడి అకస్మాత్తుగా జరగడంలో సైనికులకు తప్పించుకునే అవకాశం దొరకలేదు. ఈ దాడిలో 18 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడి అనంతరం అక్కడ ఉన్న ప్రత్యేక బలగాలు నలుగురు పాక్ ఉగ్రవాదులను హతమార్చాయి. ఉరీ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఈ నేపధ్యంలో పాక్ ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాలని దేశ ప్రజలు డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో భారత సైన్యం పాక్‌పై ప్రతీకార దాడికి పక్కా ప్రణాళిక రూపొందించింది. ప్లాన్‌లో భాగంగా ముందుగా ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించారు. 2016, సెప్టెంబర్ 28 నాటి అర్థరాత్రి భారత పారా కమాండోల బృందం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి ప్రవేశించింది. అక్కడున్న ఉగ్రవాద స్థావరాలను భారత సైనికులు ధ్వంసం చేశారు. భారత సైన్యం తన పని ముగించుకుని, విజయవంతంగా తిరిగి వచ్చింది. ఈ దాడిలో 50 మందికి పైగా పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్‌కు ‘సర్జికల్ స్ట్రైక్’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలియజేశారు. దీంతో నాడు దేశ ప్రజలు సంబరాలు చేసుకున్నారు.