
పూరీ జగన్నాథుని రత్నభాండాగారం రహస్య గదిలో వెలకట్టలేని సంపద ఉంది. ఆయుధాలు కూడా ఉన్నాయని భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి కటక్‌లోని తన నివాసంలో ఒక టీవీ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… తాము రహస్యగది నుంచి తాత్కాలిక ఖజనాకు తరలించిన సంపద వివరాలు బహిర్గతం చేయరాదని, చూసింది మనసులో ఉంచుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందులో స్వామి ఆభరణాలతోపాటు యుద్ధాస్త్రాలున్నాయని, ఈ సామగ్రి భద్రంగా ఖజనాలో ఉంచి సీల్ చేయించామని, ఇదంతా వీడియో తీయించామన్నారు. పురావస్తుశాఖ (ఏఎస్‌ఐ) చేపట్టనున్న రత్నభాండాగారం మరమ్మతులకు ఎంత సమయం పడుతుందో చెప్పలేమన్నారు. ఈ పనులు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు జరుగుతాయన్నారు. రహస్యగదిలో సొరంగ మార్గం అన్వేషణకు సంబంధించి పనులు పూర్తయిన తర్వాత సంఘం సమావేశమవుతుందన్నారు.. లేజర్ స్కానింగ్ చేయించడానికి మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. సంపద లెక్కింపు భాండాగారం మరమ్మతుల తర్వాతే జరుగుతుందని జస్టిస్ రథ్ పునరుద్ఘాటించారు.




