సరిహద్దులను కాపాడేందుకు భారత సైనికులు ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతున్న వేళ…పాకిస్థాన్ సైన్యం ఎంత దుష్ట ప్రణాళికను అమలు చేస్తోందో తాజాగా బట్టబయలైంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి కొందరు ఉగ్రవాదులను పాక్ సైనికులు దగ్గరుండి మరీ భారత్ లోకి పంపిస్తున్నారు. సరిహద్దుల్లో ఎక్కడ్నించి చొరబడితే భారత సైన్యం కంటబడకుండా తప్పించుకోవచ్చో పాక్ సైనికులు ఆ ఉగ్రవాదులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
పీవోకేలోని కోట్లీ ప్రాంతంలో కొన్ని చోట్ల పఠాన్ దుస్తుల్లో ఉన్న ఉగ్రవాదులను పాక్ సైనికులు సరిహద్దుల గుండా భారత్ లోకి పంపిస్తున్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. పాక్ లోని వివిధ ప్రాంతాల నుంచి ఉగ్రవాదులను సరిహద్దుల వద్దకు తీసుకువస్తున్న సైన్యం..వారికి తమ బంకర్లలోనే ఆశ్రయం కల్పించి, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు వారిని భారత్ లోకి పంపిస్తోంది. ఆ ఫొటోలలో ఆయుధాలతో ఉన్న టెర్రరిస్టులతో పాటు పాక్ సైన్యానికి చెందిన ఎస్ఎస్ జీ కమాండోలు కూడా కనిపిస్తున్నారు.
భారత సైనిక వర్గాలు కూడా పాక్ సైన్యం చేస్తున్న కుట్రను నిర్ధారించాయి. పాకిస్థానీ రేంజర్ల రక్షణలో సరిహద్దుల్లోంచి పాక్ ఉగ్రవాదులు భారత్‌లో చొరబడుతున్నారని భారత్ సైన్యంలోని ఓ ఉన్నతస్థాయి వ్యక్తి వెల్లడించారు. ఈ విధంగా భారత్ లోకి చొరబడిన ఉగ్రవాదుల సంఖ్య 50 నుంచి 55 వరకు ఉండొచచని తెలిపారు. ఎక్కడ సరిహద్దులు దాటాలి? అక్కడ్నించి ఏ మార్గంలో వెళ్లాలి? అనే అంశాలను పాక్ సైనికులు ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న విషయం తాజా విజువల్స్‌తో వెల్లడైందని వివరించారు.
ఇటీవల కాలంలో కశ్మీర్‌లో ఉగ్రదాడులు బాగా పెరిగాయి. ఇటీవల జరిగిన ఘటనల్లో అనేకమంది భారత జవాన్లు మృతి చెందడం తెలిసిందే. జమ్మూ ప్రాంతంలో నదులు ఎక్కువగా ఉంటాయి. రుతుపవనాల సీజన్ లో ఇక్కడ వాతావరణం అత్యంత ప్రతికూలంగా ఉంటుంది.
భారీ వర్షాలు కురిసే ఈ సమయంలో భారత జవాన్లు విధులు నిర్వర్తించడం ఎంతో కష్ట సాధ్యంగా ఉంటుంది. అందుకే ఈ సీజన్ లో సరిహద్దులు దాటేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తుంటారు. వారికి పాక్ సైన్యం కూడా సహకరిస్తుండడంతో సరిహద్దులు దాటడం సులువుగా మారింది.