
తొమ్మిది నెలలుగా కనిపించకుండా పోయిన భీమవరం యువతి తేజస్విని ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులో సీనియర్ అయిన అంజాద్ ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి తేజస్వినికి దగ్గరయ్యాడు. అతను ఇదే విధంగా రెండేళ్ల కిందట విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఓ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటూ ఓ యువతిని ట్రాప్ చేశాడు. ఆ యువతిని తీసుకుని వెళ్లిపోయాడు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేసి, అంజాద్‌తో పాటు యువతిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి యువతిని తల్లిదండ్రులతో పంపించారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అంజాద్ యువతులకు మాయమాటలు చెప్పి సన్నిహితంగా మెలిగేవాడని తెలిసింది.
గత ఏడాది అక్టోబర్‌లో మిస్సింగ్ కేసు నమోదు
తేజస్విని విజయవాడలో తమ పెద్దమ్మ ఇంట్లో ఉంటూ మాచవరంలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతోంది. అదే కళాశాలలో చదువుతున్న అంజాద్ అలియాస్ షన్ను ప్రేమ పేరుతో తేజస్వినిని ట్రాప్ చేశాడు. కొంతకాలం సన్నిహితంగా మెలిగిన తర్వాత గత ఏడాది అక్టోబర్ 28వ తేదీ రాత్రి ఇద్దరూ కలిసి హైదరాబాద్ వెళ్లారు. వెళ్లేటప్పుడు అంజాద్.. ఇంటి నుంచి కొంత నగదు తీసుకెళ్లినట్లు తెలిసింది. మరుసటి రోజు సాయంత్రానికి కూడా తేజస్విని భీమవరం రాకపోయేసరికి.. కంగారు పడిన ఆమె తల్లి విజయవాడ వచ్చి.. మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
డబ్బుల్లేక ఫోన్లు, చెవి కమ్మలు అమ్మేసి..
కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. యువతీ, యువకుల ఫోన్ల సిగ్నళ్ల ఆధారంగా హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు హోటల్‌కు చేరుకునేసరికి అక్కడి నుంచి వీరు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆచూకీ అక్కడి సీసీ కెమెరాల్లోనూ లభించలేదు. అనంతరం డబ్బులకు ఇబ్బంది రావడంతో హైదరాబాద్‌లోని ఓ షాపులో రూ.18 వేలకు ఇద్దరి ఫోన్లు అమ్మేశారు. ఆ నగదుతో కేరళ వెళ్లిపోయారు. ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా ఫోన్లు విక్రయించిన దుకాణానికి వెళ్లి.. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరి స్నేహితులు, కుటుంబ సభ్యుల ఫోన్లపై పోలీసులు నిఘా పెట్టినా ఎటువంటి సమాచారం లభించలేదు. దీంతో కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు.
తొలుత హైదరాబాద్ వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉండి ఇల్లు అద్దెకు దొరుకుతుందేమోనని ప్రయత్నించారు. అది ఫలించకపోవడంతో కేరళకు వెళ్లి పది రోజులు ఉన్నారు. అక్కడా ఇల్లు దొరక్కపోవడంతో తిరిగి హైదరాబాద్ వచ్చారు. అక్కడ తేజస్విని తన చెవి కమ్మలు, బంగారు వస్తువులను రూ.15 వేలకు అమ్మేసింది. అక్కడి నుంచి రాజస్థాన్ వెళ్లారు. కొంతకాలం తర్వాత మళ్లీ ముంబయికి..అక్కడి నుంచి పుణె, దిల్లీ వెళ్లారు. అక్కడ కొన్ని రోజులు ఉండి డబ్బులు అయిపోవడంతో.. రైలెక్కి జమ్మూ వెళ్లారు. అక్కడ ఓ హోటల్‌లో పనికి కుదిరాడు అంజాద్. హోటల్ యాజమాని కేటాయించిన గదిలో వీరిద్దరూ ఉంటున్నారు. పోలీసులకు దొరికిపోతామనే భయంతో తేజస్విని, అంజాద్‌లు పలు ప్రాంతాలకు వెళ్లినట్లు తెలిసింది.
సోదరికి ఇన్‌స్టాలో మెసేజ్‌తో..
విజయవాడ నుంచి వెళ్లినప్పటి నుంచి తేజస్వినిని ఇతరులతో మాట్లాడేందుకు అంజాద్ అంగీకరించేవాడు కాదు. కొత్త ఫోన్ తీసుకున్న తర్వాత కూడా ఫోన్ ఇవ్వలేదు. అంజాద్ లేని సమయంలో అతని ఫోన్ నుంచి తన అక్కకు ఇన్‌స్ట్రాగ్రాంలో మెసేజ్ పెట్టింది. ఈ విషయాన్ని తేజస్విని కుటుంబ సభ్యులు.. విజయవాడ పోలీసులకు చేరవేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఆమె అక్క ఫోన్ నుంచి తేజస్వినితో చాట్ ద్వారా వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. వారు ఎక్కడ ఉన్నారో.. స్పష్టంగా చెప్పలేకపోయింది. ఇన్‌స్టాగ్రాం ద్వారా ప్రస్తుత లొకేషన్ పంపించమని అడిగారు. దీంతో కరెంట్ లొకేషన్‌ను యువతి పంపింది. అది వేరే దేశానిది చూపించడంతో పోలీసులు నిరుత్సాహానికి గురయ్యారు. అమెజాన్ ద్వారా ఇటీవల.. ఫొటోఫ్రేమ్‌ను బుక్ చేశారు. ఆ పార్శిల్ పెట్టెపై ఉన్న చిరునామాను ఫొటో తీసి అక్కకు పంపించింది. దీని ద్వారా వారు జమ్మూలో ఉన్నట్లు గుర్తించారు. ఆ చిరునామాను వెంటనే జమ్మూ పోలీసులకు పంపించారు. వారు పరిశీలించి.. అది జమ్మూలోని గాంధీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ప్రాంతంగా గుర్తించారు. వెంటనే బృందాన్ని ఆ ప్రాంతానికి పంపించి.. వారిని తమ ఆధీనంలోకి తీసుకోవడంతో కథ సుఖాంతం అయింది.





