
‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.. చందురు వర్ణుని అంద చందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు’… అంటూ సంగీత విద్వాంసులు త్యాగరాజస్వామి పంచరత్న కృతులను గోష్టిగానం చేసి శ్రోతలను పరమానంద భరితులను చేశారు. శ్రీ త్యాగరాజ స్వామి 257వ జయంత్యుత్సవాల్లో భాగంగా చివరి రోజు సద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో ఆదివారం పంచరత్న గోష్టి నిర్వహించారు. సద్గురు సంగీతోత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి.
త్యాగరాజస్వామి విరచిత ఘనరాగ పంచరత్న కృతుల గోష్టి గానంతో సంగీత ప్రియులను అమృత రసరాగ ప్రవాహంలో మునకలు వేయించారు. తొలుత నాట రాగం ఆదితాళంలో ‘జగదానందకారక జయ జానకీ ప్రాణ నాయకా’ అంటూ పంచరత్నాలులో తొలి కృతిని పాడి జనరంజకం చేశారు. వెంటనే గౌళరాగం ఆదితాళంలో ‘దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతో కడు దుర్విషయాకృష్ణుడై గడియ గడియకు నిండారు’ అంటూ రెండో కృతిని పాడి ఆహుతులను అలరించారు.
తదుపరి ఆరభి రాగం ఆదితాళంలో ‘సాధించెనే ఓ మనసా బోధించిన సన్మార్గ వచనములంటూ ప్రారంభించి’ సమయానికి తగు మాటలాడెనే దేవకీ వసుదేవుల నేగించినట్లు’ అనుపల్లవితో సాగిన ఈ కృతిగానం సుధారసాలను ఒలికించింది. వరాళిరాగం ఆదితాళంలో ‘కనకన రుచిరా కనకవసన…నిన్ను దిన దినమున మనసున చదువున’ కృతిని పాడి సంగీత విద్వాంసుల బృందం కరతాళధ్వనులు అందుకొంది. చివరిగా ఎందరో మహానుభావులు కీర్తన గానం చేసి పంచరత్న గోష్టి గానానికి ముక్తాయింపు పలికారు. బృందగానంలో సంగీత విద్వాంసులు పోపూరి గౌరీనాథ్, మోదుమూడి సుధాకర్, కచేరిలో పాల్గొన్నారు.





