
( మే 12 – రామానుజాచార్యుల జయంతి )
‘గతులన్నీ ఖిలమైన కలియుగమందును
గతి ఈతడే చూపె ఘన గురుదైవము’
అని కీర్తించారు తాళ్లపాక అన్నమాచార్యులు. ఆ మాటలాడే దైవమే రామానుజాచార్యులు, విశిష్టాద్వైత సిద్ధాంత ప్రధాన ప్రచారకర్త. ‘నన్ను నడిపించే విష్ణువే నిన్నూ, సమస్త జీవజాలాన్ని నడిపిస్తున్నాడు. అణువణువులోనూ విష్ణువు ఉన్నాడు. మనిషికి గుణమే కొలమానం తప్ప ఇతర అంశాలు కావు’ అంటూ సమతావాదాన్ని చాటారు ఆధ్యాత్మిక నాయకులు భగవద్రామానుజులు.
తమిళనాడులోని ‘భూతపురి’ అనే శ్రీపెరంబూ దురులో ఆసూరి కేశవాచార్యులు, కాంతిమతి దంపతులకు చెన్నైలోని తిరువల్లిక్కేణి పార్థసారథిస్వామి వరప్రసాదితంగా వైశాఖ మాసంలో శుక్ల పక్షం పంచమి తిథిన జన్మించారు.ఈ సంవత్సరం మే 13న ఆయన జయంతిని జరుపుకుంటున్నాము.
రామానుజులు విశిష్ట ఆచార్యులుగా, ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. సమసమాజ స్థాపన కోసం పరితపిస్తూ ఆయన అహరహం పాటుపడ్డారు. తిరుమంత్రంలోని ‘సర్వధర్మాన్ పరిత్యజ్య..’ అనే చరమ శ్లోకం అర్థం తెలుసుకొని శ్రీసౌమ్యనారాయణ పెరుమాళ్ కోవెల పైభాగం నుంచి తిరుమంత్రార్థాన్ని ఉద్ఘోషించారు.
తిరుమల సప్తగిరులు సాక్షాత్తు ఆదిశేషుడేనని తెలిసిన రామానుజులు తన పాదాలను కొండపై మోపడానికి ఇష్టపడలేదు. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం మోకాళ్ళపై కొండెక్కి స్వామిని కటాక్షం చేసుకున్నారు. తిరుమల ఆలయంలో పూజా విధానం కొరుక చక్కని వ్యవస్థను ఏర్పరించింది, తిరుమల ఉన్న దైవం విష్ణువేనని చాటి చెప్పింది భగవద్రామానుజులే.
తను నమ్మిన సిద్ధాంతం కోసం పాటుపడిన సంస్కర్తగా, దాన్ని ప్రచారం చేసేందుకు అసాధారణమైన కష్టాలను దాటిన వ్యక్తిగా, మేధావిగా, అన్నింటికీ మించి ఓ గొప్ప భక్తునిగా రామానుజుడు సూచించిన మార్గాన్ని గుర్తెరిగి అనుసరిస్తే సర్వదా శుభకరం.





