
26views
ఆరెస్సెస్ ఏ సంస్థకూ రిమోట్ కంట్రోల్ గా పనిచేయదని ఆరెస్సెస్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ పునరుద్ఘాటించారు. స్వతంత్ర సంస్థలను నేరుగా నడపడం కంటే, సమాజ సేవకు అంకితమైన వ్యక్తులను తీర్చిదిద్దడమే తమ ప్రధాన బాధ్యత అని తెలిపారు.
RSSకు సంబంధించి చాలా కాలంగా ఉన్న ఒక అభిప్రాయంపై స్పందిస్తూ, వివిధ రంగాలలో పనిచేస్తున్న సంస్థలపై ఆర్‌ఎస్‌ఎస్ ఎటువంటి నిర్వహణపరమైన నియంత్రణను కలిగి ఉండదని భాగవత్ స్పష్టంగా పేర్కొన్నారు.
వివిధ సంస్థలు స్వతంత్రంగానే పనిచేస్తాయని, అయితే.. ఆరెస్సెస్‌కి మాత్రం వ్యక్తి నిర్మాణం, జాతీయ, సామాజిక సేవకు అంకితమైన కార్యకర్తలను తయారు చేయడమే ప్రధాన లక్ష్యమని, దానిపైనే దృష్టి పెడుతుందని తేల్చి చెప్పారు.
నాగ్‌పూర్‌లోని లక్ష్మీనగర్‌లో ఉన్న సైంటిఫిక్ సొసైటీ హాల్‌లో “డాక్టర్ హెడ్గేవార్ – ఆధునిక్ యుగ్ కే శాలివాహన్” అనే యూట్యూబ్ డాక్యుమెంటరీ బహిరంగ ప్రదర్శన సందర్భంగా డాక్టర్ మోహన్ భాగవత్ పై వ్యాఖ్యలు చేశారు. కాలక్రమేణా ఒక సంస్థ పనితీరు విధానం, పరిధి మారినప్పటికీ, దాని మౌలిక విలువలు మాత్రం మారకుండా ఉండాలని అన్నారు.
విస్తరణ, ప్రభావం పెంచుకునే క్రమంలో తమ నిజమైన ఆదర్శాలను కాపాడుకోవడమే ఏ అభివృద్ధి చెందుతున్న సంస్థకైనా అతిపెద్ద సవాలు అని ఆయన పేర్కొన్నారు.





