
కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు సత్యదేవుని అన్నప్రసాదాన్ని ఉచిత మధ్యాహ్న భోజన పథకం ద్వారా పంపిణీ చేయడం గురువారం నుంచి ప్రారంభమైంది.
దేవస్థానం ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలను నిర్వహిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయం మేరకు ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమాన్ని దేవస్థానం ఈవో సూర్యచక్రధరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు పర్వత సురేష్, కామర్స్ చిరంజీవి రావు తదితరులు ప్రారంభించి విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. స్వామివారి గోధుమనూక ప్రసాదంతో పాటు పులిహోర, పప్పు, అన్నం, పచ్చడి, కూర, సాంబారు, మజ్జిగ వంటి ఆహార పదార్థాలు విద్యార్థులకు అందించారు. విద్యార్థులు ఈ ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఈవో సూర్యచక్రధరరావు మాట్లాడుతూ, దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల ఆర్థిక, ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిత్యాన్నదాన పథకం ద్వారా ఉచిత మధ్యాహ్న భోజనం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యాభివృద్ధికి అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని, విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.
మూడు విద్యాసంస్థల్లో కలిపి సుమారు 600 మంది విద్యార్థులకు ప్రతిరోజూ భోజనం అందించేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.





