
భారతదేశంలో ప్రాంతానికో ప్రత్యేక సంప్రదాయం కనిపిస్తుంది. టెక్నాలజీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత ఆధునిక కాలంలోనూ కొన్ని గ్రామాల్లో శతాబ్దాల నాటి ఆచారాల్ని ప్రజలు ఇప్పటికీ కచ్చితంగా పాటిస్తున్నారు. అలాంటి అరుదైన సంప్రదాయం మధ్యప్రదేశ్ అశోక్ నగర్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో కొనసాగుతోంది. గ్రామంలో ఆవు మరణం, హత్య లేదా ఏదైనా అశుభ సంఘటన జరిగితే కొంతకాలం పాటు ఎలాంటి శుభకార్యాలు, ముఖ్యంగా వివాహాలు నిర్వహించకూడదనే ఆచారం ఇప్పటికీ అమల్లో ఉంది. దీంతో కూతుళ్లను తమ సొంత ఇంటి నుంచి కాకుండా గ్రామ సరిహద్దుల బయటి నుంచే అత్తింటికి పంపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గ్వాలియర్- చంబల్ ప్రాంతంలోని అశోక్ నగర్ జిల్లా ఖిరియా మౌ, కొలువా, టక్నేరి, బమోరీ, కబీరా వంటి గ్రామాల్లో పెద్దలు తీసుకునే నిర్ణయాల్ని గ్రామమంతా పాటించడం ఆనవాయితీ. గ్రామంలో ఏదైనా అశుభం జరిగితే కొంతకాలం వివాహాలు, ఇతర శుభకార్యాల్ని నిలిపివేస్తారు.
ఆవు మరణంతో 12 ఏళ్ల పాటు పెళ్లిళ్లే లేవు!
ఖిరియా మౌ గ్రామంలో కొన్నాళ్ల కిందట ఒక 4 వీలర్ వాహనం ఢీకొనడంతో గాయపడ్డ ఆవు కొద్ది రోజులకు చనిపోయింది. గ్రామస్థులు ఆవుకు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. అప్పుడే గ్రామ పెద్దలు సమావేశమై, ఈ ఘటన గ్రామానికి అశుభ సూచికగా భావించి కొంత కాలం పాటు ఊళ్లో ఎలాంటి వివాహాలు నిర్వహించకూడదని నిర్ణయించారు. అయితే తర్వాత వరుసగా జరిగిన ప్రమాదాల్లో ఒక ఇంజినీర్ ట్రాక్టర్ కింద పడి మరణించడం, మరో చిన్నారి కూడా ప్రమాదంలో చనిపోవడం వంటి ఘటనలతో వివాహాలపై నిషేధం కొనసాగుతూనే వచ్చింది. ఇలా దాదాపు 12 ఏళ్ల పాటు గ్రామంలో ఒక్క పెళ్లి కూడా జరగలేదు.
గ్రామం బయటే పెళ్లిళ్లు- ఇంటి దగ్గర వేడుకల్లేవ్!
అయితే అలా అని గ్రామస్థులు వివాహాల్ని పూర్తిగా నిలిపి వేయలేదు. గ్రామ సరిహద్దులు దాటి పొలాల్లో, సమీప గ్రామాల్లో లేదా పట్టణాల్లో పెళ్లిళ్లు నిర్వహించారు. అక్కడి నుంచే అప్పగింతలు చేసేవారు. గ్రామానికి చెందిన భగవాన్ సింగ్ మాట్లాడుతూ, నాలుగేళ్ల కిందట తన సోదరి వివాహం నిశ్చయమైనప్పటికీ గ్రామ సంప్రదాయాల కారణంగా ఇంట్లో పెళ్లి చేయలేకపోయానని తెలిపారు. గ్రామం బయటే ఖాళీ ప్లేస్‌లో వివాహం జరిపించినట్లు చెప్పారు. ‘అక్కను మా ఇంటి గుమ్మం నుంచి అత్తింటికి పంపలేకపోవడం మాత్రమే జీవితాంతం మిగిలిపోయిన బాధ’ అని ఆయన భావోద్వేగంతో పేర్కొన్నారు. ఈ ఒక్కరే కాదు తమ సొంతింటి నుంచి కూతుళ్లను అత్తవారింటికి పంపించలేకపోయామనే బాధ ప్రతి తల్లిదండ్రుల్లోనూ మిగిలిపోయింది. అయితే సుమారు 8 నెలల కిందట గ్రామంలోని ఒక కుటుంబం ధైర్యం చేసి తమ ఇంట్లోనే వివాహం నిర్వహించింది. ఆ తర్వాత క్రమంగా ఇతర కుటుంబాలు కూడా గ్రామంలోనే వివాహాలు జరిపించడం ప్రారంభించాయి.
ఆ ఊర్లో ఇప్పటికీ అదే ఆచారం
ఖిరియా మౌ మాత్రమే కాదు. సమీపంలోని కబీరా అనే గ్రామంలోనూ ఇలాంటి సంప్రదాయమే కొనసాగుతోంది. దాదాపు ఏడాదిన్నర కిందట రాత్రి వేళ ఓ బైక్ ఢీకొనగా దూడ చనిపోయింది. దీంతో గ్రామ పెద్దలు సంప్రదాయం ప్రకారం రెండేళ్ల పాటు వివాహాలపై నిషేధం విధించారు. ‘ఇది మా పూర్వీకులు పెట్టిన సంప్రదాయం. రెండేళ్లు పూర్తయ్యాక ఎలాంటి అశుభ ఘటనలు జరక్కపోతే మళ్లీ వివాహాలు ప్రారంభిస్తాం’ అని ఊరి పెద్ద రామ్ స్వరూప్ సింగ్ చెబుతున్నారు. ప్రస్తుతం కబీరా గ్రామంలో ఏదైనా శుభకార్యం నిర్వహించాల్సి వస్తే సమీప గ్రామాలు లేదా అశోక్ నగర్‌లోనే చేయాల్సి వస్తోంది. టక్నేరి అనే గ్రామంలో ఏడాదిన్నర క్రితం ఒక మహిళ హత్యకు గురైంది. ఆ ఘటన తర్వాత ఈ గ్రామంలోనూ శుభకార్యాల్ని నిలిపివేశారు.
బమోరీ గ్రామానికి చెందిన రామ్‌నరేశ్ రఘువంశీ కుటుంబం కూడా ఇదే సమస్యను ఎదుర్కొంది. ఓ చిన్నారి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో గ్రామంలో వివాహాల్ని నిలిపివేశారు. దీంతో తన కుమార్తె పెళ్లిని మరో గ్రామంలోని బంధువుల ఇంట్లో నిర్వహించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ధనవంతులు బయట మ్యారేజ్ గార్డెన్స్ అద్దెకు తీసుకొని పెళ్లిళ్లు చేసుకుంటారని, కానీ తమలాంటి పేద కుటుంబాలకు ఇది భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ జర్నలిస్ట్ దేవ్ శ్రీమాలి ప్రకారం, ఆధునిక సమాజంలో చాలా మంది ఇలాంటి ఆచారాల్ని మూఢనమ్మకాలుగా భావించినప్పటికీ, గ్రామస్థులు మాత్రం తమ పూర్వీకుల వారసత్వంగా చూస్తున్నారు. గతంలో భీండ్, మొరెనా ప్రాంతాల్లోనూ ఇలాంటి సంప్రదాయాలు ఉండేవని, గ్రామంలో మరణం సంభవిస్తే 13వ రోజు పూర్తయ్యే వరకు పెళ్లిళ్లు నిర్వహించరని ఆయన గుర్తు చేశారు.




