
(మే 13 – సార్వత్రిక ఎన్నికల ప్రత్యేకం )
ప్రభువును సాక్షాత్తు విష్ణు అంశ సంభూతుడిగా శాస్త్రాలు చెబుతున్నాయి. పాలకుడు తీసుకునే నిర్ణయాల కారణంగా ఎన్నో కోట్లమంది ప్రజల జీవితాలు ప్రభావితమవుతాయి. పాలన చేసే వ్యక్తి అనేకమంది ప్రజానీకంలాగానే భూమిపై జన్మిస్తాడు. భగవత్ కృప పరిపూర్ణంగా ఉండటం చేతనే గద్దెనెక్కే భాగ్యం దక్కిందనే అవగాహనతో పాలన చేయాలి.
పుడమిపై కోటానుకోట్ల ప్రజానీకం జన్మించి అస్తమించారు. పుట్టిన వాళ్లందరూ చరిత్ర కెక్కలేదు. కాల గర్భంలో కలిసిపోకుండా పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్న పాలకులందరూ తమ నిర్ణయాధికారాన్ని సద్వినియోగపరచు కున్నవారే.
పాలనాధికారం ప్రజాసేవ కోసమే కానీ స్వార్థ ప్రయోజనాలకోసం కాకూడదు. ప్రభువు దగ్గర వివిధ మార్గాల్లో జమ అయిన ధనమంతా ఆశ్రితులు, నిరు పేదలకు ఉపయోగించడానికి తప్ప తాను తన కుటుంబ సభ్యుల విలాసం కోసం కాదనే సత్యం తెలుసుకోవాలి. ప్రభువు ఆశ్రితులను నిరాదరిస్తే ఏం జరుగుతుందో ద్రుపద మహారాజు ద్రోణాచార్యుల మధ్య వైరానికి కారణమైన సంఘటన ద్వారా తెలుస్తుంది. దారితప్పిన ప్రభువును కాలం ఏదో ఒక రూపంలో మట్టికరిపిస్తుంది.
విశ్వంభర (భూమి) మీద ఆధిపత్యాన్ని మహాభాగ్యమంటారని పూర్వం లాక్షణికులు నిర్వచించారు.యుగాలు మారాయి. యుగధర్మం మారింది. మారనిది ఎప్పటికీ ఒకటుంటుంది. అది ఆశ్రిత జనరక్షణ. *అలాంటి నమ్మకం, ధైర్యం శ్రీరామచంద్రుడు వానరులకు అందించాడు కాబట్టే వారంతా మహాజలధిని అవలీలగా లంఘించారు. శ్రీరాముడు నిజమైన నాయకుడు. ముల్లోకాలకు అసలైన ప్రభువు. ఎందుకంటే అధికారాన్ని అవలీలగా త్యజించి అడవుల బాట పట్టాడు. సందర్భం ఎంతో కఠినమైనదైనప్పటికీ తన నిర్ణయాధికారాన్ని స్పష్టంగా ఉపయోగించుకోగలిగాడు.





