
రేపు (మంగళవారం)హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో హనుమాన్ జయంతి శోభా యాత్ర నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. రేపు ఉదయం 11:20 గంటలకు ఆంజనేయుని శోభా యాత్ర ప్రారంభం కానుంది. ఈ ఊరేగింపు గౌలిగూడ రామ మందిరం నుంచి ప్రారంభమై.. తాడ్‌బండ్ సికింద్రాబాద్ మీదుగా గౌలిగూడ రామమందిరం, పుత్లిబౌలి క్రాస్ రోడ్, ఆంధ్రాబ్యాంక్ క్రాస్ రోడ్, కోటి, సుల్తాన్ బజార్, రాంకోటి, కాచిగూడ, నారాయణగూడ, చిక్కడపల్లి మీదుగా కొనసాగనుంది.
నగరంలో దాదాపు 12 కిలో మీటర్ల దూరం శోభ యాత్ర నిర్వహించనున్నారు. రాత్రి 8 గంటలకు తాడ్‌బండ్‌లోని హనుమాన్ మందిరం వద్ద యాత్ర ముగియనుంది. మరో ఊరేగింపు కర్మన్‌ఘాల్‌లోని ఆంజనేయస్వామి దేవాలయం నుంచి ప్రారంభమై చంపాపేట్ వద్ద హైదరాబాద్ నగర పరిధిలోకి ప్రవేశించనుంది. మూసారం బాగ్ జంక్షన్ – మలక్ పేట – నల్గొండ ఎక్స్ రోడ్ – అజంపురా రోటరీ – చాదర్ ఘాట్ ఎక్స్ రోడ్ మీదుగా డీఎంఅండ్‌హెచ్ఎస్ వద్ద ప్రధాన ఊరేగింపులో కలవనుంది. ఇక ఈ యాత్ర జరగనున్న ప్రదేశాలన్నింటిలోనూ ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు.





