
భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు అని, అందుకే ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖ జిల్లా కొమ్మాదిలోని సాగర్‌నగర్‌లో శ్రీమోగదారమ్మ, మహాలక్ష్మి పద్మాలయంలో శ్రీలక్ష్మీ దుర్గ, సరస్వతి దేవతామూర్తులకు ప్రాణప్రతిష్ట ఉత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ ప్రాణప్రతిష్టలో వెంకయ్య దంపతులు పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగర తీరాన హైందవ సంస్కృతి ప్రకారం హోమం, యజ్ఞం నిర్వహించి దేవతామూర్తులకు విగ్రహ ప్రతిష్ట చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. మతం వ్యక్తిగతమని, జీవన విధానంలో నిత్యం ఆధ్యాత్మిక చింతన అలవరుచుకోవడం ఉత్తమమన్నారు. ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించిన ఆలయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సూరపనేని లక్ష్మీప్రసాద్‌ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లొడగల అప్పారావు, స్థానిక గ్రామ పెద్దలు పాల్గొన్నారు.





