News

భిన్న జగతిలో విశ్వబంధుగా భారత్‌

214views

ప్రపంచంలో నేడు పలు దేశాలు యుద్ధాలకు కాలు దువ్వుతున్నాయని, ఇటువంటి తరుణంలో భారత తీర్థంకరుల బోధనలకు కొత్త ఔచిత్యం ఏర్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భిన్న దృక్పథాలు గల ప్రపంచంలో విశ్వబంధుగా భారత్‌ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోందని తెలిపారు. ఆదివారం 2,550వ భగవాన్‌ మహావీర్‌ నిర్వాణ్‌ మహోత్సవ్‌ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా సత్యం, అహింస సూత్రాలను అంతర్జాతీయ వేదికలపై భారత్‌ చెబుతోందన్నారు. ఈ వేడుకలకు సంబంధించిన స్మారక స్టాంపు, నాణేలను విడుదల చేసిన మోదీ ఆశీస్సులు అందించిన జైన సాధువులకు కృతజ్ఞతలు తెలిపారు. యోగ, ఆయుర్వేదం వంటి భారతీయ వారసత్వాలను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. కళాకారులు ప్రదర్శించిన ‘వర్తమాన్‌ మే వర్ధమాన్‌’ నృత్యనాటికను ప్రధాని అభినందించారు. భగవాన్‌ మహావీర్‌ బోధనలను నేటి యువత అనుసరిస్తోందంటే అది ఈ దేశం సరైన దిశలో పయనిస్తోందని చెప్పడానికి సంకేతమని తెలిపారు. గత ఫిబ్రవరి నెలలో పరమపదించిన ఆచార్య శ్రీ విద్యాసాగర్‌ మహరాజ్‌కు నివాళులు అర్పించిన ప్రధాని ఆయనతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.