
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బుధవారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల మధ్య మిథున లగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు. కంకణబట్టర్ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జేఈఓ వీరబ్రహ్మం మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో ప్రధానంగా ఏప్రిల్ 20న హనుమంత వాహనం, ఏప్రిల్ 22న కల్యాణోత్సవం, 23న రథోత్సవం, 25న చక్రస్నానం జరుగుతాయన్నారు. ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకొని కల్యాణానికి హాజరయ్యే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా వేదపండితులు చతుర్వేద పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ నాగేశ్వరరావు, ఎస్‌ఈ జగదీశ్వర్‌రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ నటేష్ బాబు, వీజీఓ బాలిరెడ్డి, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
శేషవాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల అభయం
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన బుధవారం రాత్రి శేషవాహనంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారు భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుంచి భజన బృందాల కోలాటాల నడుమ పురవీధుల్లో వాహనసేవ జరిగింది..కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ నటేష్ బాబు, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
కవి సమ్మేళనం
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం బమ్మెర పోతన జన్మదినాన్ని పురస్కరించుకొని కవి సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్ అధికారి రాజగోపాల్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా టీటీడీ దత్సహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనందతీర్థాచార్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో పసుపులేటి శంకర్ పురాణంపైన, నారాయణరెడ్డి భాగవతంలోని గజేంద్రుని ఆక్రందన, డాక్టర్ నీలవేణి రంతి దేవుని చరిత్ర, డాక్టర్ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి భాస్కర రామాయణంలోని శివధనుర్భంగం, సీత స్వయంవరంపై, ఎం.శివారెడ్డి కుచేలోపాఖ్యానంపైన కవిత్వాన్ని చెప్పారు.
రుచికరమైన అన్నప్రసాదాలు
శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు విశేషంగా హాజరయ్యే వేలాది మంది భక్తులకు నిరంతరాయంగా రుచికరమైన అన్నప్రసాదాలను టీటీడీ అందిస్తోంది. అలాగే తాగునీరు, మజ్జిగ అందించనున్నారు. ఆలయ ప్రాంగణంలో ఎండ వేడిమి నుంచి భక్తులకు ఇబ్బంది లేకుండా జర్మన్ షెడ్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు అల్పాహారం, 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తిరిగి సాయంత్రం 6.30 గంటల నుంచి 7 గంటల వరకు రుచికరమైన అన్నం, సాంబారు, రసం, మజ్జిగ, పచ్చడి, కూరలు, బెల్లం పొంగలి అందజేయనున్నారు.
బ్రహ్మోత్సవాలలో నేడు
కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం 7.30 గంటలకు వేణుగానాలంకారణల దాశరథి దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు హంసవాహనంపై స్వామివారు విహరిస్తారు.





