News

వైభవంగా శ్రీరామనవమి వసంతోత్సవం

306views

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వసంతోత్సవ పూజలు వైభవంగా సాగుతున్నాయి. బుధవారం వేకువజామున అర్చకస్వాములు స్వామికి ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత మంగళాశాసనం, తీర్థ గోష్ఠిని జరిపించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరుకు స్వామి మంటపం వద్ద శ్రీ మద్రామాయణ పారాయణం, సుందరాకాండ పారాయాణం, దివ్య ప్రబంధ సేవా కాలములను శాస్త్రోక్తంగా జరిపించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన 25 మంది రుత్విక్కులు స్వామివారి సన్నిధిలో పారాయణాలు చేపట్టారు. మంటపంలో సింహాసనంపై ఆశీనులైన సీతారామచంద్రమూర్తికి లక్ష తులసీ, కుంకుమార్చనలు కొనసాగించారు. యాగశాలలో గాయత్రీ రామాయణం, సంక్షేప రామాయణం, సుందరాకాండ హవనం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. సాయంత్రం 6 గంటలకు యాగశాలలో ఆరాధన, ప్రత్యేక హవనములు, పారాయణాలు చేపట్టారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరిసింహాచార్యులు, వర ప్రసాద్‌, పవన్‌కుమారాచార్యులు పాల్గొన్నారు.