
ఒంటిమిట్ట కోదండరామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో భాగంగా 20 పనులు చేపట్టాలని రూ.3.95 కోట్లకు అనుమతిచ్చారు. అంతకుముందు మౌలిక వసతుల కల్పనకు మరో రూ.4 కోట్లకు పచ్చ జెండా ఊపారు. ఇక్కడ ఒకటి, రెండు మాత్రమే పూర్తయ్యాయి. మిగతావన్నీ వివిధ దశల్లో జరుగుతున్నాయి. ఈ నెల 16 నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అనుమతిచ్చిన పనులను ఈ నెల 10వ తేదీలోపు పూర్తిచేయాలని గడువు విధించారు. గుత్తేదారులకు బిల్లుల చెల్లింపుల్లో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. చేసిన విలువలో 50 శాతం ఇస్తే వేగవంతంగా చేస్తామని వారు అంటున్నారు. కాకపోతే 2023-24 ఆర్థిక సంవత్సరం గత నెల ముగిసింది. పద్దు సర్దుబాటు చేయడానికి ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం కల్యాణ వేదిక ప్రాంగణంలో సిమెంటు అచ్చులు పరుస్తున్నారు. భూ ఉపరితల జలాశయం, నీటి తొట్టె, తారురోడ్డు, రంగులు వేయడం, నేల శుభ్రం, చదును పనులు, పుష్కరిణి నవీకరణ, అన్నదానం తయారీ కేంద్రం, మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. తారు రహదారి పూర్తి చేయగా మిగతావన్నీ సాగుతూనే ఉన్నాయి. ఇంజినీరింగ్ అధికారుల మధ్య సమన్వయలోపంతో బిల్లులు చెల్లింపులకు సకాలంలో ప్రతిపాదనలు పంపడం లేదు. ఒకవేళ బిల్లు పంపినా ఆడిట్‌లో వెంటనే అనుమతి ఇవ్వడంలేదంటున్నారు. గతేడాది బ్రహ్మోత్సవాల సమయంలో చేసిన కొన్ని పనులకు ఇప్పటికీ బిల్లులు ఇవ్వలేదు. జేఈవో, సీఈ, ఇతర అధికారులు ఇక్కడికి వచ్చి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. బిల్లుల చెల్లింపులు సవ్యంగా జరుగుతున్నాయా లేదా అని ఎవరూ ఆలోచించడం లేదని గుత్తేదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడువులోపు చేయకపోతే నల్ల జాబితాలో చేర్చుతామని, జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారని, తమకు బిల్లులివ్వకుండా పనులు ఎలా చేయాలని వారంతా ప్రశ్నిస్తున్నారు.





