News

భారత్‌ ఎన్నికల్లో జోక్యానికి చైనా ‘ఏఐ’

282views

భారత్‌లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో జోక్యానికి కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌- ఏఐ) సాయంతో చైనా ప్రయత్నించే అవకాశం ఉందని సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ హెచ్చరించింది. భౌగోళిక, రాజకీయ అంశాల్లో తన ప్రయోజనాలను పెంచుకునేందుకు సామాజిక మాధ్యమాల్లో ఏఐ ద్వారా సమాచారాన్ని డ్రాగన్‌ గుమ్మరిస్తుందని తెలిపింది. భారత్‌తో పాటు అమెరికా, దక్షిణ కొరియా వంటి దేశాల్లోనూ చైనా జోక్యం చేసుకుంటుందని ‘మైక్రోసాఫ్ట్‌ ముప్పు విశ్లేషణ కేంద్రం’ (ఎంటీఏసీ) జనరల్‌ మేనేజర్‌ క్లింట్‌ వాట్స్‌ తన బ్లాగ్‌పోస్ట్‌ ద్వారా తెలిపారు. మీమ్స్‌, వీడియోలు, ఆడియో రూపంలో తప్పుడు ప్రచారం చేయవచ్చని, డీప్‌ఫేక్‌ సాంకేతికతను కూడా ఉపయోగిస్తుందని హెచ్చరించారు.

ఉత్తర కొరియా ప్రమేయం ఉందా?

చైనా మద్దతు ఉన్న సైబర్‌ గ్రూపులు ఉత్తరకొరియా ప్రమేయంతో ఎన్నికలను లక్ష్యంగా చేసుకున్నాయని మైక్రోసాఫ్ట్‌ అనుమానం వ్యక్తం చేసింది. ‘ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 64 దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రపంచ జనాభాలో దాదాపు 49 శాతం మంది ఈ దేశాల్లో ఉన్నారు. దుష్ప్రచారంతో ఈ దేశాల ఓటర్లను తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. చైనా ఎత్తుగడలను అడ్డుకోకపోతే అదే జరుగుతుంది. ప్రస్తుతానికి ఎన్నికల్లో వీటి ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ కాలక్రమేణా ప్రభావవంతంగా మారుతాయి’ అని హెచ్చరించింది. ఈ ఏడాది జనవరిలో తైవాన్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఏఐ ఆధారిత తప్పుడు సమాచారాన్ని చైనా వ్యాప్తి చేయించిందని ఆరోపించింది. ‘స్టార్మ్‌ 1376’ లేదా ‘స్పామౌఫ్లేజ్‌’ అనే చైనా మద్దతుగల సైబర్‌ సంస్థ చురుకుగా పనిచేసిందని తెలిపింది. ఇందులో ఇరాన్‌ హస్తం కూడా ఉన్నట్లు వెల్లడించింది. విదేశీ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఒక ప్రభుత్వ సంస్థ ఏఐ కంటెంట్‌ను వినియోగించడం ఇదే తొలిసారి అని మైక్రోసాఫ్ట్‌ పేర్కొంది. అమెరికా ప్రజల్లో విభేదాలు పెంచే ప్రయత్నాలు చేసి, అధ్యక్ష ఎన్నికల్లో ఫలితం తనకు అనుకూలంగా వెలువడేలా తప్పుడు సామాజిక మాధ్యమ ఖాతాలను చైనా వినియోగిస్తుందని తెలిపింది.

మోదీతో ఇటీవలే చర్చించిన బిల్‌గేట్స్‌

గత నెలలో దిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీని మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ కలిశారు. ఏఐ సాంకేతికతో ఎదురవుతున్న సరికొత్త సవాళ్లపై ఆ సందర్భంగా చర్చించారు. ఏఐ శక్తిమంతమైనదే అయినా అది దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని బిల్‌గేట్స్‌ హెచ్చరించారు. భారత్‌లాంటి ప్రజాస్వామ్య దేశంలో డీప్‌ఫేక్‌ను ఎవరైనా వినియోగించొచ్చని చెప్పారు.