
రామకృష్ణ మిషన్‌లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆయన బోధనలు నిరంతం ప్రేరణ శక్తిగా నిలుస్తాయని చెప్పారు. ఇటీవల కన్నుమూసిన స్వామి స్మరణానందకు నివాళులు అర్పించారు. ‘‘లోక్‌సభ ఎన్నికల కోలాహలం మొదలైన సమయంలో స్మామి స్మరణానంద పరమపదించారన్న వార్తతో కొంతసేపు నేను నిశ్చేష్టుడినయ్యాను. భారత ఆధ్యాత్మిక చైతన్యంలో ఆయనది కీలక భూమిక. ఆయన లేకపోవడం వ్యక్తిగతంగా నాకెంతో లోటు. కొన్నేళ్ల క్రితం స్వామి ఆత్మస్థానంద.. ఇప్పుడు స్వామి స్మరణానంద దివంగతులు కావడం విషాదకరం. ఈ నెలారంభంలో నేను కోల్‌కతా వెళ్లినప్పుడు స్వామి స్మరణానంద ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ఆసుపత్రిని సందర్శించాను.
అన్ని సంస్కృతులు, సంప్రదాయాలను స్వామి ఆత్మస్థానంద ప్రేమించి, గౌరవించిన విధానం నన్నెంతో ఆకట్టుకుంది. గుజరాత్‌లో ఉన్నప్పుడు ఆయన గుజరాతీ భాష నేర్చుకున్నారు. ఆయన గుజరాతీలో మాట్లాడుతుంటే వినడం నాకెంతో ఇష్టం. ఇలాంటి సాధుసంతులు సామాజిక మార్పులకు పాటుపడిన తీరు మన మాతృభూమికి గర్వకారణం. ఐకమత్య స్ఫూర్తితో పనిచేస్తూ, సమాజంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో వారు మనకు చూపించారు. అమృతకాలంలో వికసిత భారత్‌ను సాధించడంలో అవి మనకు బలాన్నిస్తాయి’’ అని మోదీ పేర్కొన్నారు.





