
ప్రతి ఒక్కరూ దైవమార్గంలో నడుచుకుని దేవుడి కృపను పొందాలని శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి ప్రవచించారు.ప్రకాశం జిల్లా మార్కాపురం సాధనిక అమలక లక్ష్మీనారాయణస్వామి (వెంకచ్చమ్మ) ఆలయం సప్తాహ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో చిన్నజీయర్ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. ప్రతి ఒక్కరూ అధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని, దైవానుగ్రహం ఉంటే ఏదైనా సాధించవచ్చని పేర్కొన్నారు. వేదాలు, ఉపనిషత్తుల సారాంశాన్ని గ్రహించి, ధర్మాన్ని ఆచరించాలని సూచించారు. వేదాంతం అంటే నైరాశ్యం కాదని అందులో ఉన్న గొప్ప విషయాలను తెలుసుకోవాలన్నారు. శ్రీమన్నారాయణ చూపిన సన్మార్గంలో నడవాలన్నారు.
సీతారామ కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం ఘట్టాలను చిన్నజీయర్‌స్వామి ఆధ్వర్యంలో వేద పండితులు వైభవంగా నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవ పూర్ణాహుతి, చక్రస్నానం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.





