News

మే 31 నుంచి అహల్యాబాయి హోల్కర్ త్రిశతాబ్ది వేడుకలు : దత్తాత్రేయ హోసబాలే జీ

283views

పుణ్యశ్లోక్ దేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా మే31 2024న ప్రారంభమవుతాయని సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబాలే జీ తెలిపారు. నాగ్‌పూర్‌లోని రేషింబాగ్‌ స్వామి దయానంద్ సరస్వతి ప్రాంగణంలో జరుగుతున్న మూడు రోజుల అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఎబిపిఎస్) సమావేశాల సందర్భంగా ఈ రోజు అయన మాట్లాడుతూ దేవి అహల్యాబాయి హోల్కర్ ఒక సాధారణ నేపథ్యం ఉన్న గ్రామీణ యువతి నుంచి అసాధారణమైన పాలకురాలిగా ఆమె చేసిన జీవనప్రయాణం నేటికీ గొప్ప స్ఫూర్తిదాయకమని అన్నారు. కర్తవ్యం, సరళత, ధర్మం పట్ల నిబద్ధత, పరిపాలనా దృక్పథం, దూరదృష్టి మరియు అద్భుతమైన ఆధ్యాత్మిక పవిత్రతకు ఆమె ఒక ప్రత్యేక ఉదాహరణ అని పేర్కొన్నారు.

అహల్యాబాయి హోల్కర్ “శంకర్ అజ్నేవరుణ్” (శ్రీ శంకర్ ఆదేశాల ప్రకారం) రాజముద్రతో భగవాన్ శంకర్ ప్రతినిధిగా పరిపాలించారన్నారు. భూమిలేని రైతులు, భిల్లుల వంటి గిరిజన సమూహాలు మరియు వితంతువుల ప్రయోజనాలను పరిరక్షించే ప్రజా సంక్షేమ ఆధారిత కార్యక్రమాలతో ఆమె పాలన ఆదర్శంగా నిలిచిందన్నారు. దేవి అహల్యాబాయి సమర్ధవంతమైన పాలకురాలిగా, సామాజిక పరివర్తన, వ్యవసాయ అభివృద్ధి, నీటి నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, ప్రజల సంక్షేమానికి అంకితమయ్యారని చెప్పారు.

అహల్యాబాయి హోల్కర్ తన ప్రాంతంలో మాత్రమే కాకుండా, మొత్తం దేశంలోని దేవాలయాలలలో పూజలు, ఆర్థిక నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చేశారని అన్నారు. బద్రీనాథ్ నుండి రామేశ్వరం మరియు ద్వారక నుండి పూరి వరకు ఆక్రమణదారులచే అపవిత్రం చేయబడిన ఆలయాలను అహల్యాబాయి పునరుద్ధరించి, దండయాత్రల వల్ల కలిగిన నష్టపోయిన ఆలయాలకు కొత్త జీవం పోశారని పేర్కొన్నారు. ఈ గొప్ప ప్రయత్నాల కారణంగానే ఆమెకు “పుణ్య శ్లోక్” అనే బిరుదు వచ్చిందన్నారు. భారతదేశం అంతటా విస్తరించి ఉన్న ఈ పవిత్ర స్థలాల అభివృద్ధి ఆమె జాతీయ దృష్టికి ప్రతిబింబంగా నిలిచాయని వివరించారు.

పుణ్య శ్లోక్ దేవి అహల్యాబాయి 300వ జన్మదినోత్సవం సందర్భంగా, స్వయంసేవకులందరితో పాటు సభ్యులందరూ సంఘ్ నిర్వహించే కార్యక్రమాలలో హృదయపూర్వకంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.దేవి అహల్యాబాయి హోల్కర్ చూపిన సరళత్వం, సహనశీలత, ఆధ్యాత్మికతత్వం, జాతీయ ఆత్మగౌరవం బాటలో అగ్రగామిగా నిలవడమే ఆమెకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు.