
వైయస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని టిటిడి జేఈవో వి.వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను శుక్రవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం విభాగాల వారీగా సమీక్షించారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికి పక్కా ప్రణాళికతో ముందడుగు వేయాలని సూచించారు. ఉత్సవాలకు వచ్చే నెల 16న అంకురార్పణ చేస్తామని, ఏప్రిల్ 22న సీతారాముల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. భక్తులకు వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో ఇప్పటికే సమీక్ష జరిపి అనేక సూచనలు చేశామన్నారు. కల్యాణానికి హాజరయ్యే భక్తులందరికీ ముత్యాల తలంబ్రాలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆయనవెంట సీఈ నాగేశ్వరరావు, ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, డీఎఫ్‌వో శ్రీనివాసులు, ఆర్డీవో మధుసూదన్, ఈఈ సుమతి, డిప్యూటీ ఈవోలు నటేష్‌బాబు, ప్రశాంతి, శివప్రసాద్, గుణభూషణ్‌రెడ్డి, వీజీవో బాలిరెడ్డి, తదితరులున్నారు.





