
అంతర్గత శాంతి నుంచి ప్రపంచశాంతి వరకు.. మానవాళి సంక్షేమానికి అవసరమైన సందేశాన్ని ‘విశ్వ ఆధ్యాత్మిక మహోత్సవం’ అందిస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. వసుధైక కుటుంబ భావనను విశ్వవ్యాప్తం చేయడంతో పాటు మత సామరస్యాన్ని, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక చైతన్యంలో వివక్షకు, విభజనకు తావు లేదన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామలోని కన్హశాంతివనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విశ్వ ఆధ్యాత్మిక మహోత్సవంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. మహత్తర కార్యక్రమంలో పాల్గొనడంతో గొప్ప అనుభూతి కలిగిందన్నారు. ఆధ్యాత్మికతపై ఆధారపడిన మన సంస్కృతి ‘వసుధైక కుటుంబం’ అనే భావనను విశ్వవ్యాప్తం చేస్తుందన్నారు. ‘‘ప్రతి ఒక్కరినీ సమదృష్టితో చూసే భావన మన ఆధ్యాత్మిక సంప్రదాయానికి పునాది. పూర్వీకుల వారసత్వంగా వచ్చిన నైతిక ఆదర్శాలు, ఆధ్యాత్మిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రతిఒక్కరూ పనిచేయాలి. మహావీరుడు, బుద్ధుడు, జగద్గురు శంకరాచార్య, సంత్ కబీర్, సంత్ రవిదాస్, గురునానక్ నుంచి స్వామి వివేకానంద వరకు ప్రపంచానికి ఆధ్యాత్మిక సారాన్ని అందించారు. మహాత్మాగాంధీ రాజకీయాల్లో ఆధ్యాత్మిక విలువలు పాటించారు. అందుకే ఆయనను ‘సబర్మతీ సంత్’ అని పిలుస్తారు.
వర్తమానంలో చేసే మంచి పనులే భవిష్యత్తును నిర్ణయిస్తాయి. విధిని అనుకూలంగా మార్చుకోవడానికి మనసును నియంత్రించాలి. ఇందుకోసం ధ్యాన మార్గాన్ని ఆచరించాలి’’ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురు, హార్ట్‌ఫుల్‌నెస్ సెంటర్ వ్యవస్థాపకుడు కమలేష్ డి పటేల్ (దాజీ) గురించి ప్రస్తావిస్తూ హార్ట్‌ఫుల్‌నెస్ ఉద్యమాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారన్నారు. దాజీకి పద్మభూషణ్‌తో సత్కరించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. కన్హ శాంతివనం ఆవరణలో రాష్ట్రపతి తొలుత మొక్కను నాటారు. అక్కడ ఏర్పాటుచేసిన వేదాలు, పురాణాలు, రామాయణం, మహాభారతం, బుద్ధిజం, భక్తి ఉద్యమాలకు సంబంధించిన ప్రదర్శనను తిలకించారు. వేదిక మీదకి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్, కమలేష్ డి పటేల్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకి జ్ఞాపికను బహూకరించి శాలువాతో సత్కరించారు. కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ మాట్లాడుతూ.. యోగా, ధ్యానంలో భారత్ విశ్వగురువుగా మారిందన్నారు. ‘‘యోగా, ధ్యానానికి ఉన్న గొప్పతనం వర్ణించలేనిది. భారత్ ఆర్థికశక్తిగా అవతరిస్తుందని 1895లోనే స్వామి వివేకానంద చెప్పారు. ధ్యానం, యోగా ఆచరించిన ఆయన మరో 50 ఏళ్లలో భారత్‌కు స్వాతంత్య్రం వస్తుందని నాడు చెప్పారు. 21వ శతాబ్దంలో భారత్ ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మిక, ఆర్థిక గురువుగా మారుతుందని కూడా ఆనాడే చెప్పారు. అది త్వరలో సాకారమవుతుంది’’ అని అన్నారు.
కమలేష్ డి పటేల్ మాట్లాడుతూ.. ప్రేమను పంచాలనే సందేశంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. మతాలకు అతీతంగా అనేక సంస్థలు, ఇందుకోసం పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పే దిశగా పయనిస్తున్నాయన్నారు. సమాజంలోని అంతరాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. యువత కూడా ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు.





