News

యూపీలో కేరళస్టోరీ తరహా ఘటన : హిందూబాలికను ఉచ్చులోకి లాగిన ముస్లిం యువతి

350views

ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్ జిల్లాలో కేరళ స్టోరీ తరహా ఘటన వెలుగు చూసింది. 15ఏళ్ళ హిందూ బాలికను ఒక ముస్లిం యువతి తప్పుదోవ పట్టించింది, తనతో తీసుకునిపోయింది. రెండురోజుల తర్వాత ఆ బాలిక ఒక ముస్లిం యువకుడి ఇంట్లో పోలీసులకు దొరికింది. మార్చి 6న జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసారు.

గజియాబాద్ జిల్లా సాహిబాబాద్‌లో మార్చి 6న ఒక హిందూ మహిళ స్థానిక పోలీస్ స్టేషన్‌లో, తన 15ఏళ్ళ కుమార్తె ఒక ముస్లిం యువతితో కలిసి వెళ్ళిపోయిందని ఫిర్యాదు చేసింది. మార్చి 8న ఆ బాలిక సాహిబాబాద్‌లోని ముస్తఫా మజీద్ దగ్గర రహీసుద్దీన్ అనే 25ఏళ్ళ యువకుడి ఇంట్లో దొరికింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 363 కింద కిడ్నాప్ కేసు నమోదు చేసారు.

ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసారు. నిందితుల్లో ఒకరైన యువతి బాధిత బాలికతో స్నేహం చేసి, ఆమెకు బ్రెయిన్‌వాష్ చేసిందని, హిందూ బాలికను తన బంధువుల ఇంటికి తీసుకెళ్ళిందనీ తల్లి వివరించింది. అక్కడ ఒకరోజు ఉన్నాక బాలిక రహీసుద్దీన్ ఇంటికి వెళ్ళిందని పోలీసులు కనుగొన్నారు. అక్కడ బాలికకు మాదకద్రవ్యాలు ఇచ్చారనీ, ఆ మత్తులో ఉండగా ఆమెపై అత్యాచారం జరిగిందనీ తల్లి వాపోతోంది. పోలీసులు బాధిత బాలికకు వైద్యపరీక్షలు చేయించారు. ఆ నివేదిక ఇంకా రావలసి ఉంది.

విశ్వహిందూపరిషత్‌కు చెందిన ధర్మపరివర్తన, మాతృశక్తి అనే హిందూ సంస్థలు బాధిత బాలిక కుటుంబానికి అండగా నిలిచాయి. కేరళ స్టోరీ తరహాలో జరిగిన ఈ ఘటన వెనుక మరింతమంది హస్తం ఉందనీ, వ్యవస్థీకృతంగా జరుగుతున్న ఇలాంటి ఘటనల బాధితులు మరెంతోమంది ఉన్నారనీ, ఆ సంస్థలు ఆరోపిస్తున్నాయి. పోలీసులు సమగ్ర విచారణ జరిపి స్థానికంగా జరిగిన అలాంటి సంఘటనలు అన్నింటినీ వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నాయి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పిస్తామనీ, న్యాయపోరాటానికి సహకరిస్తామనీ హిందూసంఘాలు వెల్లడించాయి.