
శ్రీశైలంలో వచ్చేనెల 6 నుంచి 10వ తేదీ వరకు ఉగాది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు తెలిపారు. బుధవారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో ఉత్సవాల ఏర్పాట్ల సన్నాహక సమావేశం నిర్వహించారు. ముందుగా ఈఓ డి.పెద్దిరాజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది ఉత్సవాలను కూడా విజయవంతం చేయాలని సూచించారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అధికసంఖ్యలో భక్తులు వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాలినడక భక్తులు ఉత్సవాలకు ముందే ఆలయానికి చేరుకునే అవకాశం ఉన్నందున ఈ నెల 29లోపు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో దేవస్థానం డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి రమణమ్మ, వేదపండితులు గంటి రాధాకృష్ణ, అధ్యాపక, ఏఈవోలు ఫణిధరప్రసాద్, మోహన్, మల్లికార్జునరెడ్డి, హరిదాసు, స్వాములు, పర్యవేక్షకులు ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు పాల్గొన్నారు.





