News

కాలగర్భంలో కలిసిపోతున్న కవయత్రి మొల్ల ఆనవాళ్లు

236views

మహా కవయిత్రి మొల్ల ఆనవాళ్లు కాలగర్భంలో కలిసిపోతున్నాయి.వైయస్సార్ జిల్లా పెద్ద గోపవరంలో ఆమె నడియాడిన ప్రాంతంలో పరిరక్షణ కొరవడడంతో చరిత్ర, విలువైన ఆధారాలు భావితరాలకు అందకుండా పోయే ప్రమాదం ఏర్పడిందని సాహతీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొల్ల సప్త శతాబ్ది సాహితీ సాంస్కృతిక కళా మహోత్సవాలు ఈ నెల 14వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ సానుకూలంగా స్పందించి మొల్ల ఆనవాళ్ల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని రచయితలు కోరుతున్నారు.

పర్యవేక్షణ కరవు
పెద్ద గోపవరంలో కవయిత్రి మొల్ల జన్మించిన ప్రాంతలో ఆమె ఆనవాళ్ల పరిరక్షణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. మొల్ల నివాసం ఉన్న పూరిపాక, నడయాడిన పరిసరాలు శిథిలమై అధ్వాన్నంగా మారాయి. ఆమె ఆరాధ్య దైవమైన శ్రీకంఠమల్లేశ్వరాలయం, స్నానమాచరించిన కోనేరు పర్యవేక్షణ కొరవడింది. గోపవరానికి మొల్ల పేరును పెట్టాలని, మొల్ల జయంతి ఉత్సవాలను ఏటా ప్రభుత్వమే నిర్వహించాలని సాహితీ వేత్తలు ఎప్పడి నుంచో కోరుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన కరవైంది.

సాహితీ పీఠం చేసిన కృషి ఇదే

మొల్ల ఆనవాళ్ల పరిరక్షణకు మొల్ల సాహితీ పీఠం కృషి చేస్తూనే ఉంది. 2005 నుంచి మొల్ల సాహితీ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.1,15 కోట్లతో మొల్ల హరితా రెస్టారెంట్‌ నిర్మించేలా కృషి చేశాం. ఆమె జీవన ఆధారంగా లఘ చిత్రం, మొల్ల రచించిన రామాయణ తాళపత్రాలు సేకరణ, మొల్ల మందిర నిర్మాణం, మహిళా స్ఫూర్తి మొల్ల పుస్తక రచన, ఐదు రూపాయల తపాలా బిళ్ల కవర్‌ విడుదల తదితర అంశాలకు సాహితీ పీఠం కృషి చేసింది.-గానుగపెంట హనుమంతరావు, మొల్ల సాహితీ పీఠవ్యవస్థాపక అధ్యక్షుడు