News

తూర్పుగోదావరి జిల్లాలో శివరాత్రికి సిద్ధమైన ప్రముఖ శివాలయాలు

327views

మహాశివరాత్రి పర్వదినానికి ఉమ్మడితూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ శివాలయాలు సిద్ధమయ్యాయి. రాజమహేంద్రవరం, కోటిపల్లి, ద్రాక్షారామ, పిఠాపురం, సామర్లకోట, ముక్తేశ్వరం, మురమళ్ల, కుండలేశ్వరం, ర్యాలి తదితర శివాలయాల్లో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆలయాలను మిరుమిట్లు గొలిపే విద్యుత్తు దీపాలతో అలంకరించారు. అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు.

రాజానగరం: ఈనెల 8న రాజానగరంలో మహాశివరాత్రి జాగరణ మహోత్సవం నిర్వహిస్తున్నారు. రాజానగరంలో జాతీయ రహదారిని ఆనుకుని 30 ఎకరాల విస్తీర్ణంలో భక్తులకు, మరో 20 ఎకరాల్లో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఆ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు వరకు శివాలయంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పుంగనూరు జాతి ఆవులతో సుందరంగా అలంకరించిన బసవేశ్వర ముత్యాల వాహనంపై ఉంచి, 1116 మంది వాహనం ముందుభాగంలో కోలాట నృత్యాలతో కోలాహలంగా శివరాత్రి జాగరణ నిర్వహించే ప్రాంగణానికి వస్తారు. సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు స్వామి వారికి 108 కిలోల ముత్యాల తలంబ్రాలతో శివపార్వతుల కల్యాణం, పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. రాత్రి ఎనిమిది గంటల నుంచి తెల్లవారుజాము నాలుగు గంటల వరకు లింగోద]్బవం, తదితర ప్రత్యేక పూజా కార్యక్రమం ఉంటుంది. మరోవైపు వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు, యోగాసనాలు ఏర్పాటు చేశారు. హైదరాబాదు నుంచి రప్పించి ప్రాంగణంలో ఆదిపురుష్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు సుమారు 40 వేల మంది కూర్చుని కార్యక్రమాలను వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

సామర్లకోట: పంచారామాల్లో ప్రసిద్ధి చెందిన యోగలింగమూర్తి భీమేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం విఘ్నేశ్వరపూజ, అంకురారోపణ, దీక్షాధారణ, కల్యాణం నిర్వహించారు. 7న స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, అమ్మవారికి నీరాజన మంత్రపుష్పములు నిర్వహించనున్నారు. మహాశివరాత్రి రోజున స్వామివారి మూల విరాట్‌కు అభిషేకాలు నిర్వహిస్తారు. 9న ఉదయం స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి పట్టణంలో రథోత్సవం నిర్వహిస్తారు. 10న ఉదయం త్రిశూలస్నానం, తీర్థ సేవ ఉంటుంది. 11న రాత్రి స్వామి, అమ్మవారికి శ్రీపుష్పయోగోత్సవం నిర్వహిస్తారు.

అయినవిల్లి: ముక్తేశ్వరం ముక్తికాంత సమేత క్షణముక్తేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక అలంకరణలు చేస్తున్నారు. చలువపందిళ్లు, బారీకేడ్లు ఏర్పాటు చేశారు. తొగరపాయ స్నానఘట్టాల వద్ద ఇంజిన్లు ఏర్పాటు చేసి నీటినితోడుతున్నారు. స్నానఘట్టాలను శుభ్రంచేసి జల్లుస్నానాలు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి దీపోత్సవం, శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా జ్యోతిర్లింగార్జన నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

రాజమహేంద్రవరం: దక్షిణకాశీగా పేరొందిన రాజమహేంద్రవరం నగరంలోని కోటిలింగేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి 1.05 గంటలకు మూలవిరాట్‌కు విశేష అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. భువనేశ్వరీదేవికి విశేష కుంకుమార్చన జరుగుతుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు రథోత్సవం మొదలవుతుంది. రాత్రి 11 గంటలకు లింగోద్భవ అభిషేకాలు జరుగుతాయని ఈవో భాగవతుల వెంకట రమణమూర్తి తెలిపారు. పందిరి మహదేవుడు కోటిలింగాల సత్రంలో అన్నదానం జరుగుతుంది.

పామర్రు: కోటిపల్లిలో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. దేవాలయం వద్ద క్యూకాంప్లెక్సుల నిర్మాణం పూర్తయింది. సుమారు 300 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలో అవుట్‌పోస్టు ఏర్పాటు చేశామని డీఎస్పీ రామకృష్ణ వివరించారు. స్నాన ఘట్టాలు శుభ్రం చేశామని, తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేసినట్లు సర్పంచి పెమ్మాడి బేబీ తెలిపారు 7 నుంచి 9వ తేదీ వరకు కోటిపల్లి మీదుగా ప్రయాణించే వాహనాలను దారిమళ్లిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. రావులపాలెం మీదుగా ఏటిగట్టు పైనుంచి వచ్చే వాహనాలు కూళ్ల వంతెన పైనుంచి పామర్రు, గంగవరం మీదుగా, యానాం వైపు నుంచి రావులపాలెం వెళ్లే వాహనాలు కోట గ్రామ నుంచి గంగవరం, పామర్రు మీదుగా మళ్లిస్తున్నట్లు చెప్పారు. కాకినాడ నుంచి అమలాపురం గోదావరి పంటుమీద వెళ్లే వాహనాలు పాత కోట ఏటిగట్టు, దంగేరు మీదుగా యానాం వైపునకు, అమలాపురం నుంచి కాకినాడ వైపునకు పంటు మీదుగా వచ్చే వాహనాలు ముక్తేశ్వరం నుంచి యానాం వైపు మళ్లిస్తున్నట్లు తెలిపారు.