News

తిరుమల భద్రమేనా?

382views

తిరుమలలో యాత్రికుల వసతి సముదాయాల (పీఏసీ)లో మెటల్‌ డిటెక్టర్‌లు, లగేజీ స్కానింగ్‌ పరికరాలు మూలనపడ్డాయి. తిరుమలకు రోజూ లక్షల్లో భక్తులు శ్రీవారి దర్శనార్థం వస్తుంటారు. ఈ నేపథ్యంలో అలిపిరి తనిఖీ కేంద్రం, శ్రీవారిమెట్టు మార్గాల్లోనూ భక్తుల లగేజీని తనిఖీచేసి పంపుతుంటారు. అయినా మద్యం, ఇతర మత్తుపదార్థాలు పైకి చేరుకుంటున్నాయి.

  • తిరుమలలోని అతిథిగృహాల్లో అద్దె గదులు దొరకని భక్తులకు యాత్రికుల వసతి సముదాయాన్ని తితిదే నిర్వహిస్తోంది. పీఏసీ-1, పీఏసీ-2లలో భక్తుల భద్రత దృష్ట్యా ప్రవేశమార్గంలో మెటల్‌ డిటెక్టర్‌ ప్రవేశమార్గాలు, లగేజీ బ్యాగుల స్కానింగ్‌కు పరికరాలను తితిదే ఏర్పాటుచేసింది. నిర్వహణలేక అవన్నీ మూతపడటంతో భక్తుల భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
  • తిరుమలలో భద్రతను మరింత తీర్చిదిద్దేందుకు గత ఏడాది ఏపీ హోంశాఖ ముఖ్యకార్యదర్శి హరీష్‌కుమార్‌ గుప్తా ఆధ్వర్యంలో ఏపీ హోంశాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన ఐఎస్‌డబ్ల్యూ ఐజీ శశిధర్‌రెడ్డి, అనంతపురం రేంజీ డీఐజీ అమ్మిరెడ్డి, జిల్లా ఎస్పీ, తితిదే సీవీఎస్‌వో ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటుచేసి పరిశీలించారు. ఏఐతో తిరుమలలోని సీసీ కెమెరాలు అనుసంధానం చేయడం, యాంటీడ్రోన్‌ టెక్నాలజీ, క్విక్‌ రియాక్షన్‌ బృందాల ఏర్పాటు తదితర అంశాలపై ప్రత్యేక కమిటీలను ఏర్పాటుచేశారు. ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. వాటిలో ఎన్ని అమలుచేశారో తెలియడం లేదు. అయితే ఉన్న పరికరాల నిర్వహణను పట్టించుకోకపోవడం భద్రతకు ఇబ్బంది కరంగా మారనుంది. ఉన్నతాధికారులు దృష్టిసారించి తిరుమల భద్రతపై ప్రత్యేక దృష్టిసారించాలని భక్తులు కోరుతున్నారు.