News

ఉత్సవాలకు వేళాయె.. అవస్థలు తీరవాయె..

339views

శైవక్షేత్రం దక్షిణ కాశీగా పేరొందిన శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఏటా నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటున్న పాలకులు, అధికారులు ఆ తర్వాత కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉత్సవాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మక ఘట్టం స్వామి చక్రతీర్థ స్నానం. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. అయితే వంశధార నదికి కనీసం రహదారి లేకపోవడం గమనార్హం. ఏటా అధికారులు వసతుల కల్పనకు అంచనాలు వేయడం, తాత్కాలిక చర్యలతో మమ అనిపించడం పరిపాటిగా మారింది.

సమస్యల తిష్ఠ ఇలా..

  • మహాశివరాత్రి ఉత్సవాల్లో ఆఖరి రోజు స్వామి చక్రతీర్థ స్నానం అత్యంత పవిత్రమైన ఘట్టం. ఉత్సవమూర్తులను వేలాది భక్తుల నడమ ఊరేగింపుగా వంశధార నదికి తీసుకెళ్తారు. ఈ సమయంలో సరైన రహదారి లేక అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
  • ఆలయం చుట్టూ ఖాళీ స్థలాల్లో చెత్త కుప్పలు పేరుకుపోయాయి.
  • మరుగుదొడ్లు ఉన్నప్పటికీ ఎటువంటి సూచిక బోర్డులు లేకపోవడంతో ఎక్కడ ఉన్నాయో భక్తులకు కనిపించట్లేదు. బస్టాండ్‌ వద్ద ఉన్న మరుగుదొడ్లు మరమ్మతులకు గురికావడంతో అలాగే వదిలేశారు.
  • రూ.40 లక్షలతో పర్యాటక భవనం నిర్మించి ప్రారంభించక పోవడంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. భక్తుల వినియోగానికి దూరంగా ఉంది.
  • ఏటా హడావుడే..
    ఈ నెల 8 మహాశివరాత్రి, 9న పడియ, 10న మహాపడియ, 11న స్వామి చక్రతీర్థ స్నానం కార్యక్రమాలు జరుగుతాయి. నేటికి ఏడు రోజులు మాత్రమే ఉంది అయినా పనులు ముందుకు సాగడం లేదు. ఉత్సవాలు దగ్గర పడే సమయంలో అధికారులు హడావుడి మాత్రం ఏటా కొనసాగుతుంది.

    ఉన్నతాధికారులకు నివేదించాం…
    భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. గత పొరపాట్లు పునరావృతం కాకుండా చూస్తున్నాం. చక్రతీర్థ స్నానాలకు వెళ్లే రహదారిలో దేవాదాయశాఖ ద్వారా తాత్కాలికంగా పనులు చేయిస్తున్నాం. అన్ని శాఖల అధికారుల సహకారంతో సమస్యలు పరిష్కరిస్తాం.-పి.ప్రభాకరరావు, ఈవో, శ్రీముఖలింగేశ్వరస్వామి క్షేత్రం