
నంద్యాల, సంఘమిత్ర సేవా సమితి (సేవా భారతి) జనారణ్యానికి దూరంగా కొండకోనల్లో ఉంటూ,ఎలాంటి వైద్య సౌకర్యాలకు నోచుకోక, సామాన్య జనులను చూస్తే దూరంగా జరిగి, చెట్ల చాటున నక్కే అడవి బిడ్డలను మచ్చిక చేసుకుని, అక్కున చేర్చుకుని వారికి ఆరోగ్యం, పోషకాహారం, వ్యాధుల నుండి రక్షణ, ప్రసూతి సమస్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలు లాంటి కీలక వైద్య సేవలు ఐ యమ్ ఏ మహిళా విభాగం కీలక మద్దత్తు తో గత సంవత్సరం పైగా అవిరళం గా ప్రతినెలా అందిస్తూ ఉండడం విశేషం .

ఈ సేవా ప్రస్థాన పరంపరలో హిమోగ్లోబిన్ శాతం 2 కు పడిపోయి మృత్యువుతో పోరాడుతున్న 8 సంవత్సరాల బాలికను హుటాహుటిన కర్నూలు తరలించి ఆరోగ్య వంతురాలిని చేయడం, టానిక్కులను మందులనూ ఆ తదుపరి కూడా ఇంటి వద్దకే అందజేస్తూ పర్యవేక్షిస్తూ ఉండటం…..
రెండు కళ్ళు కనపడక, కనీసం సహాయం చేసే వారు లేక దయనీయ స్థితిలో ఉన్న బర్ముల లింగన్న అనే 70 సంవత్సరాల వృద్దునికి, డాక్టర్ లక్ష్మయ్య గారి ద్వారా అతి సునిశితమైన నేత్ర శస్త్ర చికిత్సలు చేయించి, స్వయం సహాయం చేసుకునే స్థాయిని కల్పించడం లాంటి సేవలు మానవత్వపు అపురూప కోణాలు ఈ సేవా ప్రస్థానంలో ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి.
గిరిజన వైద్య శిబిరంలో భాగంగా, ఫిబ్రవరి 18 న భైర్లూటి, అమలాపురం గూడేలలో డాక్టర్ శైలజ యం.డి. జనరల్ మెడిసిన్, డాక్టర్ సరిత డీయన్ఓ, డీజీఓ గైనకాలజిస్ట్, డాక్టర్ యమ్ నర్మద యంబిబియస్, డీజీఓ గైనకాలజిస్ట్ & ప్రసూతి వైద్యురాలు, డాక్టర్ సుష్మ డెర్మటాలజిస్ట్, డాక్టర్ ఉదయ శంకర్, డాక్టర్ సత్య శివ సుందరి పాల్గొని 96 మందిని పరీక్షించి సలహాలు, టానిక్కులను, మందులు వంటి వైద్య సేవలు అందించారు.

ఈ కార్యక్రమంలో మిత్ర కార్యదర్శి చిలుకూరు శ్రీనివాస్, సేవాప్రముఖ్ శ్రీనివాస్, ఖండ కార్యవాహ వాసు దేవ రెడ్డి, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.





