
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో గత కొన్ని రోజులుగా (మే 11 నుండి) అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారత కార్యకర్త వికాసవర్గ 2 కార్యక్రమానికి సంబంధించిన సార్వజనికోత్సవ కార్యక్రమం జూన్ 4న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఏడాది సమారోప్ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత, ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ శ్రీ కుమార్ మంగళం బిర్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కఠినమైన క్రమశిక్షణ, సైద్ధాంతిక చర్చల నడుమ నిర్వహించిన ఈ శిక్షణా తరగతులలో, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి ఎంపిక చేయబడిన సంఘ స్వయంసేవకులకు సంస్థాగత పని, సామాజిక సేవ యొక్క వివిధ కోణాలలో విస్తృతమైన శిక్షణ ఇచ్చారు.
“సంఘ్ కార్యకలాపాలు అపూర్వమైనవి”
సార్వజనికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ కుమార్ మంగళం బిర్లా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చేస్తున్న దేశ నిర్మాణ కృషిని మనస్ఫూర్తిగా ప్రశంసించారు. ఆయన తన ప్రసంగంలో పలు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. “సంఘ్‌ను అర్థం చేసుకోవాలంటే లోపలి నుండి చూడాలని సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ గారు కొన్ని రోజుల క్రితం అన్నారు. కానీ సంఘ్ దశాబ్దాల కృషి వల్ల, దానిని బయటి నుండి చూసినా కూడా అద్భుతంగా అనిపిస్తుంది. 83,000 శాఖలు, 60 లక్షల మంది స్వయంసేవకులు, 1,77,000 సేవా కార్యక్రమాలు, లెక్కలేనన్ని సంస్థలు—అన్నీ ఒకే దిశలో పనిచేయడం అపూర్వం. స్వాతంత్య్రానికి ముందు నుండి భూకంపాలు, సునామీలు, ఇంకా లెక్కలేనన్ని ఇతర సవాళ్ల కాలం వరకు ఆర్‌ఎస్‌ఎస్ ఎల్లప్పుడూ దేశానికి, సమాజానికి అండగా నిలిచింది” అని బిర్లా కొనియాడారు.
ఈ సందర్భంగా స్వావలంబన అనేది కేవలం ఆర్థిక విధానం మాత్రమే కాదు, అది దేశ నిర్మాణం అని ఆయన స్పష్టం చేశారు. ఆదిత్య బిర్లా గ్రూప్ మరియు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకలాపాలలో అనేక సారూప్యతలు ఉన్నాయని చెబుతూ… తాము కూడా ప్రాథమిక, ఉన్నత విద్య, ఆరోగ్యం, సామాజిక ఉన్నతి, మహిళా సాధికారత మరియు నైపుణ్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తామని పేర్కొన్నారు.
యువతకు పిలుపు: మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్
భారతదేశ పారిశ్రామిక భవిష్యత్తు మరియు దేశ ప్రగతిలో యువత పాత్రపై బిర్లా ప్రత్యేకంగా ప్రధానంగా చెప్పారు. అభివృద్ధి చెందిన భారతదేశం అనే కల చాలా గొప్పదని, దానిని నెరవేర్చడంలో భారీ పరిశ్రమల పాత్ర కూడా అంతే కీలకమని ఆయన అన్నారు.
అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే కల చాలా పెద్దది. దానిని సాకారం చేయడంలో పెద్ద పరిశ్రమల బాధ్యత కూడా అంతే పెద్దది. మన దేశ యువతకు నాదొకటే పిలుపు… భారతదేశంలోనే వస్తువులను ఉత్పత్తి చేయండి, అవి మన దేశ అవసరాలు తీర్చడంతో పాటు ఇక్కడే ఉంటూ ప్రపంచ దేశాల కోసం కూడా తయారు చేయండి.”— శ్రీ కుమార్ మంగళం బిర్లా

ఈ సార్వజనికోత్సవ వేడుకకు ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనాయకత్వంతో పాటు దేశంలోని పలువురు ప్రముఖులు, గణ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. స్వయంసేవకుల క్రమశిక్షణ, దేశభక్తి ప్రదర్శనలతో ముగింపు సభ ఎంతో ఉత్తేజభరితంగా సాగింది





