News

కేదారనాథ్​లో వీఐపీ దర్శనాలకు చెక్​- ఇకపై ఎవరైనా రూ.1100 టికెట్ తీసుకుంటేనే ఎంట్రీ!

24views

పవిత్ర కేదార్​నాథ్​ క్షేత్రంలో ఇకపై వీఐపీ దర్శనాలకు చెక్ పడనుంది. సాధారణ భక్తుల దర్శన విధానం పూర్తిగా మారనుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కేదార్​నాథ్ ధామ్​లో రోజురోజుకూ భక్తుల రద్దీ బాగా పెరుగుతోంది. దీనికి తోడు వీఐపీల తాకిడి కూడా ఎక్కువ అవుతోంది. దీనితో ఒక పద్ధతిలో దర్శన ఏర్పాట్లు లేకపోవడంతో సాధారణ భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనిని సరిదిద్దడానికి బద్రీనాథ్​- కేదార్​నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఒక కొత్త నిబంధనల పత్రాన్ని విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై భక్తులు ఆలయంలో సుగమ దర్శనం (సులువైన దర్శనం) చేసుకోవడానికి రూ.1100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇకపై కేదారీశ్వరుడి సన్నిధికి వచ్చేవారు మంత్రులైనా, సెక్యూరిటీ గార్డులైనా, సాధారణ భక్తులైనా లేదా ఎంతటి ప్రముఖులైనా సరే, ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారం కచ్చితంగా ఎంట్రీ స్లిప్​ తీసుకోవాల్సి ఉంటుంది.

భక్తుల సౌకర్యం కోసమే!
‘కేదార్​నాథ్​లో వాతావరణం చాలా దారుణంగా ఉంటుంది. అయినప్పటికీ నిరంతరం భక్తుల సంఖ్య పెరుగుతోంది. వారు ఈ ప్రతికూల వాతావరణంలో గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని ఈ కీలక నిర్ణయం తీసుకున్నాం’ అని ఆలయ కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్​ సోహన్ సింగ్ రంగద్​ తెలిపారు. యాత్ర నిర్వహణ మరింత క్రమబద్ధంగా, సురక్షితంగా, సమయపాలనతో కూడినదిగా మార్చడమే ఈ కొత్త విధానం ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

కొత్త నిబంధనల ప్రకారం, నిర్ణీత ఫీజు చెల్లించిన భక్తులకు ఒక నిర్దిష్ట సమయం లోపలే సుగమ దర్శనం చేసుకునే సదుపాయం కల్పిస్తారు. దీని వల్ల గంటల తరబడి క్యూలైన్లలో నిలబడే ఇబ్బంది తప్పుతుంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, అనారోగ్యంతో ఉన్న యాత్రికులకు ఇది ఎంతో ఊరట కలిగిస్తుంది.

పూజారుల పరిస్థితి ఏమిటి?
అయితే ఈ కొత్త విధానం అక్కడ ఉన్న పండాలు (పూజారులు), అక్కడున్న ఆశ్రితులపై కూడా ప్రభావం చూపనుంది. ఇదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏళ్ల తరబడి వస్తున్న సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా, ఇకపై పూజారుల ద్వారా వచ్చే భక్తులు (ఆశ్రితులు) కూడా కొత్త నిబంధనల ప్రకారం, కచ్చితంగా ఎంట్రీ స్లిప్​ తీసుకోవాలని రూల్ పెట్టారు. ఈ చర్యల ద్వారా ఆలయ నిర్వహణపై బీకేటీసీ పూర్తి నియంత్రణ సాధించడానికి ప్రయత్నిస్తోందని స్థానికులు భావిస్తున్నారు.

మరోవైపు, ఈ కొత్త నిబంధనల వల్ల అక్కడ చాన్నాళ్లుగా ఉన్న వీఐపీ సంస్కృతికి అడ్డుకట్టపడుతుందని మరికొందరు ఆశిస్తున్నారు. అంటే, ఇకపై ఎవరి రికమండేషన్లు, రికార్డులు అవసరం లేదు. అలాగే ఎవరి ప్రభావాలు, ఒత్తిళ్లు లేకుండా కేవలం ఫీజు చెల్లించి హాయిగా దేవుని దర్శించుకునే అవకాశం లభిస్తుందని వారు అంటున్నారు. ఈ విధంగా ఆలయ కమిటీ తీసుకున్న తాజా నిర్ణయంపై భక్తుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెరుగైన నిర్వహణ, సురక్షితమైన యాత్ర అనుభవం కోసం ఇది ఒక మంచి ముందడుగు అని కొందరు భక్తులు కొనియాడుతుంటే, భక్తి పేరుతో సాధారణ భక్తులపై అదనపు ఆర్థిక భారం మోపడమేనని మరికొందరు విమర్శిస్తున్నారు. ఈ కొత్త నిబంధనలపై సోషల్ మీడియాలోనూ జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

కాగా, ప్రస్తుతం కేదార్​నాథ్ ధామ్​లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మంచుగాలులు వీస్తున్నాయి. అయినప్పటికీ భక్తులు మాత్రం భారీగా వస్తున్నారు. ఈ నేపథ్యంలో బీకేటీసీ ప్రవేశపెట్టిన ఈ కొత్త నిబంధనలు రానున్న రోజుల్లో కేదార్​నాథ్​ యాత్ర నిర్వహణ రూపురేఖలనే మార్చివేసే అవకాశం ఉంది.