
రైతులందరూ ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత అన్నారు. స్థానిక కలెక్టరేట్లో ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి రైతులు సాగు చేయాల్సిన పంటలు, అనుసరించాల్సిన పద్ధతులకు సంబంధించి వ్యవసాయ శాఖ రూపొందించిన పుస్తకాన్ని ఆ శాఖ అధికారులతో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి కొంతమంది సిబ్బందిని కేటాయించినట్లు వివరించారు. వీరు రైతులకు వివిధ రకాల కషాయాలు, ఘన, జీవామృతాలు తయారు చేసే విధానం చూపిస్తారన్నారు. దీర్ఘకాలిక పంటల జోలికి వెళ్లకుండా పెసర, మినుము, సజ్జ, అలసంద వంటి పంటలు సాగు చేసుకుంటే రైతులు నష్టపోకుండా ఉంటారన్నారు. రసాయనాల వాడకం తగ్గిస్తే అన్ని పంటలకు బాగుంటుందని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా మేనేజర్ కె. ఐ. సుదర్శన్ రాజు, వ్యవసాయ శాఖ జిల్లా ఇన్‌ఛార్జి అధికారి బాలాజీ నాయక్, ఎర్రగొండపాలెం ఏడీఏ రమణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.





