ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రదార్శనికులు – 22 ; ఆచార్య ఎన్.జి. రంగా

280views

బహుముఖ ప్రజ్ఞాశాలి. రైతాంగనాయకులు ఆచార్యరంగా గారు అచంచల దేశభక్తులు. ఏక కాలంలో అటు వలసవాదులతోనూ, ఇటు ఫ్యూడల్ శక్తులతోనూ అలుపు ఎరగని పోరాటం చేసిన యోధుడు. సోవియెటిజంను, నెహ్రూ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించి, రైతాంగ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకోసం అహిర్నశలు శ్రమించిన నేత. మార్క్సిజంపట్ల ఆకర్షితుడైనా, దాని డొల్లతనాన్ని అనతికాలంలోనే తెలుసుకొని మన దేశ సమస్యలకు, రైతాంగం సమస్యలకు మార్క్పిజంలో పరిష్కారాలు లభించవని ఎలుగెత్తి చాటి, ప్రత్యామ్నాయ ఆర్థిక సామాజిక సిద్ధాంతాలకు రూపకల్పన చేసిన ద్రష్ట ఆచార్యరంగా. 1900లో సామాన్య మధ్య తరగతి రైతుకుటుంబంలో నిడుబ్రోలులో పుట్టాడు.

తన 20వ ఏట ప్రపంచ ప్రఖ్యాత ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేరి, ఆర్ధిక, రాజకీయశాస్త్రాలలో నిష్ణాతుడయ్యాడు. 1926లో ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి బి.లిట్ పట్టా పొందారు. దక్షిణ భారత దేశప్రజల ఆర్థిక స్థితిగతులపై ఆయన రచించిన సిద్ధాంతవ్యాసం నేటికి ప్రామాణికమైనదిగా పరిగణించ బడుతున్నది. ఆక్సఫర్డ్ లో విద్యార్థిగా ఉన్నప్పుడే మహాత్మాగాంధీ ఆలోచనల చేత ప్రభావితం అయ్యారు. సామాజిక, ఆర్థిక సమస్యల పట్ల గాంధీ చూపిన శ్రద్ధ, రైతుల, చేతివృత్తుల వారి అభివృద్ధికై గాంధీగారి తపన ఆయనను బాగా ఆకట్టుకొన్నాయి. గ్రామీణ భారతదేశానికి గాంధీ సూచించిన ఆర్ధిక ప్రణాళికే శరణ్యమని రంగా గారు గట్టిగా భావించారు. గాంధీని ఆర్ధిక ప్రగతి నిరోధకునిగా, భారతదేశ పెట్టుబడిదారుల ప్రతినిధిగా, సామాజిక ప్రతిఘాతకునిగా కమ్యూనిష్టులు ముద్రవేయటం ఆయనకు నచ్చలేదు.

ఇంగ్లాండ్ నుండి రాగానే 1927లో మద్రాసు పచ్చయప్ప కళాశాలలో ఆచార్యులుగా ఆయన నియమితులయ్యారు. మద్రాసు ప్రభుత్వ ఆర్థిక సలహాదారుడిగా కూడా ఆయన వ్యవహరించేవారు. 1930లో ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా గాంధీ గారి పిలుపుకు స్పందించి, తన ఉద్యోగానికి, పదవులకు రాజీనామా చేసి స్వాతంత్రోద్యమంలోకి దుమికారు. ఖద్దరు ధరించి, గాంధీ టోపీ పెట్టుకొని, శుద్ధిగాంధేయవాది అయ్యారు. సామాన్య రైతాంగంలో స్వాతంత్య్ర పిపాసను రంగరించి, జాతీయోద్యమంలో వారిని ముఖ్య భాగస్వాములను చేసిన ఘనత రంగాగారిదే. భారతదేశంలో జమీందారుల వ్యవస్థరద్దుకు రంగాగారే కారణం. వెంకటగిరి, మునగాల, చల్లపల్లి, మందస జమీందార్లకు వ్యతిరేకంగా ఆయన చేసిన ఉద్యమాలు చరిత్ర ప్రసిద్ధాలు. 1929 ఆగష్టు 14న జమీందారీ రైతుసంఘాన్ని నెలకొల్పారు. భారత కిసాన్ మహాసభ నిర్మాణానికి ఎట్టకేలకు కాంగ్రెసు తన సమ్మతిని తెలియచేసింది. స్వామి సహజానంద, ఆచార్య రంగా వ్యవస్థాపక అధ్యక్ష, కార్యదర్శులుగా భారతకిసాన్ సభ పనిచేయటం మొదలుపెట్టింది. శాసనసభ ద్వారా జమీందారీ వ్యవస్థరద్దు చెయ్యాలన్న రంగాగారి డిమాండ్ దేశమంతటా నెమ్మదిగా వ్యాపించి, 1946లో భారత కిసాన్ సభ, ఆ తర్వాత కాంగ్రెసు పార్టీ ఆమోదం పొందింది.

1930వ దశకంలో వచ్చిన ఆర్థిక మాంద్యం రైతులను, చేతివృత్తుల వారిని ఎంతగానో క్రుంగదీసింది. ఘోరంగా చితికిపోయిన రైతులు తీసుకున్న ఋణాలు తీర్చలేకపొయ్యారు. చాలామంది రైతులు నామమాత్రం ధరకు తమ పొలాలును అమ్ముకున్నారు. ఋణవిమోచన చట్టం తీసుకొని వచ్చి, రైతాంగానికి యిచ్చిన ఋణాలను మాఫీ చెయ్యాలని రంగాగారు పెద్దఎత్తున ఉద్యమించారు. 1931లో ప్రారంభమయిన ఈ ఉద్యమం 1937-38 దాకా సాగింది. రాజాజీ ప్రభుత్వం 1938లో ఋణ విమోచన చట్టం తీసుకొనివచ్చి, రైతులకు ఎంతో మేలుచేసింది. రైతు ఋణవిమోచన చట్టం రంగాగారు సాధించిన ఘనవిజయం. తర్వాత కాలంలో గజరిగిన ఋణమాఫీల చట్టాలకు ఆ చట్టమే ఒక నమూనా అయింది.

1933లో జైలు నుండి విడుదల అయిన కొద్ది మాసాలకే రంగాగారు రైతు యాత్రలు నిర్వహించారు. తొలి యాత్ర సందర్భంగా ప్రభుత్వం కృష్ణా, గోదావరి జిల్లాల్లో రెండు అణాల అదనపు శిస్తును రద్దుచేసింది. రెండవ యాత్ర వలన మద్రాసు కళా ప్రాంతంలోని 23 జిల్లాల రైతులకు ఎంతో కొంత మేలు చేకూరింది. 1934లో ఆలహారా వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొని, జైలుకు వెళ్ళారు. 1937లో రైతాంగరక్షణ పేరుతో ఇచ్ఛాపురం నుండి మద్రాసు వరకు జరిపిన మహాపాదయాత్ర నాలుగు నెలలపాటు సాగింది. రైతులను చైతన్యం చేయటానికి ఈ పాదయాత్రలు ఎంతగానో ఉపయోగించాయి. 1941లో జైలు నుండి విడుదల కాగానే తిరిగి నిర్బంధించి రాయవేలూరు జైలులో పెట్టి 1942లో విడుదల చేశారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా ఆయనను తిరిగి నిర్బంధించి, 1944 అక్టోబరు 9న విడుదల చేశారు.

1935-46 మధ్య నడిచిన తొలి కేంద్ర శాసనసభలో రంగాగారు సభ్యులు. శ్రీకృష్ణదత్త ఫాలీవాల్, మోహన్ లాల్ సక్సెనాలతో కలసి సభాభవన శిఖరంపై ఎగిరే యూనియన్ జెండాను తొలగించారు. స్వాతంత్ర్యం రాకముందు, ఆ తర్వాత కేంద్ర శాసనసభలో సభ్యులుగా పనిచేసిన ఘనత రంగా గారిది. అంతే కాదు 1991 వరకు పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక దానిలో కొనసాగిన ఘనత కూడా ఆయనకే చెందుతుంది. 1946లో ఏర్పాటు అయిన భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా ఆయన ఎన్నికయి, తన మేధస్సుతో రాజ్యాంగ రచనలో తోడ్పడ్డారు.