
ఇజ్రాయెల్, పాలస్తీనా సమస్య పరిష్కారానికి దశాబ్దాలుగా తాము రెండు దేశాల వాదాన్ని వినిపిస్తున్నామని, ఇప్పుడు చాలా దేశాలు మద్దతు పలుకుతున్నాయని, అంతేకాకుండా ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించాల్సి ఉందని అభిప్రాయపడుతున్నాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబరు 7 నాటి హమాస్ దాడి కచ్చితంగా ఉగ్ర చర్యేనని, అదే సమయంలో ఇజ్రాయెల్ మానవతా సాయంపై స్పందించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. భద్రతపై జర్మనీలోని మ్యూనిక్‌లో జరిగిన చర్చా వేదికలో ఆయన మాట్లాడారు. ఇందులో అమెరికా, జర్మనీల విదేశాంగ మంత్రులు బ్లింకెన్, అన్నాలెనా బేర్‌బాక్ పాల్గొన్నారు. పౌర మరణాలపట్ల ఇజ్రాయెల్ మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జైశంకర్ సూచించారు. ‘ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదంలో భారత్‌కు భిన్న కోణాలున్నాయి. వాటిలో నాలుగు అతి ముఖ్యమైనవి. 1. అక్టోబరు 7వ తేదీ నాటి హమాస్ దాడి ముమ్మాటికీ ఉగ్ర చర్యే. అందులో ఎటువంటి అనుమానాల్లేవు. 2. ప్రతి దాడుల సందర్భంగా పౌర మరణాల పట్ల ఇజ్రాయెల్ బాధ్యతతో వ్యవహరించాలి. మానవతా సాయం విషయంలోనూ అంతర్జాతీయ సూచనలను గమనంలోకి తీసుకోవాలి. 3. బందీల విడుదల తప్పనిసరి. 4. మానవతా కారిడార్ ఏర్పాటు చేయడం. తద్వారా బాధితులకు ఉపశమనం కల్పించడం. అది శాశ్వతంగా కొనసాగాలి. లేకుంటే సంక్షోభం మళ్లీ మళ్లీ తలెత్తుతుంది’ అని జైశంకర్ పేర్కొన్నారు.





