
రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌కు చెందిన జితేంద్ర పటేల్, రిషబ్ జైన్ అనే యువకులు అయోధ్య రాముడి దర్శనానికి సైకిళ్లపై బయలుదేరారు. శనివారం ఉదయం 5:15 గంటలకు ఫతే పాఠశాలలో ఉన్న బాలాజీ ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత.. శ్రీరాముడిని స్తుతిస్తూ వీరు తమ ప్రయాణం మొదలుపెట్టారు. ఉదయ్‌పుర్ సైక్లింగ్ క్లబ్ సహా పలువురు స్థానికులు వారిని ప్రోత్సహిస్తూ ‘జై శ్రీరామ్’ నినాదాలు చేశారు. ఉదయ్‌పుర్ నుంచి అయోధ్యకు 1,100 కిలోమీటర్ల దూరం ఉందని, నాలుగు రోజుల్లో అయోధ్యకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు యువకులు తెలిపారు. మొదటిరోజు ఉదయపుర్ నుంచి కోటా వరకు 300 కి.మీ, రెండోరోజు కోటా నుంచి శివపురికి 230 కి.మీ, శివపురి నుంచి కాన్పుర్ వరకు మూడోరోజు 327 కి.మీ, నాలుగోరోజు కాన్పుర్ నుంచి అయోధ్య వరకు 220 కి.మీ సైక్లింగు చేయనున్నారు. ఫిబ్రవరి 22న వీరిద్దరూ బాలరాముణ్ని దర్శించుకునే అవకాశం ఉంది.





