ArticlesNews

స్వాతంత్రోద్యమంలో ఆంధ్రవీరులు – 8 ; తమ్మన్న దొర

305views

రంపచోడవరం తూర్పు కనుమల్లో గోదావరి జిల్లాలో వుంది. బ్రిటిష్ వలస పాలకులు ఏజెన్సీ పరిపాలన అనే పేరుతో ఓ ప్రత్యేక పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టింది. దానికి కారణం ఏజెన్సీ ప్రాంతంలో దొరికే అటవీ సంపదన ముఖ్యంగా చింతపండు, సీకాకాయ్, జిగురు, తేనె, కలప, ఔషధవృక్షాలు, పండ్లు, నల్లమందు మొదలైన అనేక విలువైన వస్తువులు ఇంగ్లాండ్ కు తీసుకుపోవాలని ఆలోచనతో ఒక నూతన పరిపాలనను వీరిపై రుద్దింది. అదే ముఠాదార్ విధానము. ముఠాదార్ వ్యవసాయదారుడు కాదు. పన్ను వాసులు చేసే అధికారి. వసూలైన మొత్తంలో కొంత ముఠాదార్‌కు కమీషన్‌గా ముడుతుంది.

ముఠాదార్ విధానము గోదావరి జిల్లాలోని రంప, విశాఖ జిల్లా గొలుగొండా, మాడుగుల ప్రాంతాలలో కన్పిస్తుంది. 1835లో రంప ప్రాంతపు మున్సబుదార్ రామ భూపతి దేవ్ మరణించాడు. ఆ తరువాత అతని అవివాహ కుమార్తెను, మున్సబుదార్ ముఠాదార్లు అంగీకరించారు. కానీ బ్రిటిష్ వారికి నచ్చలేదు. దానితో 1848 లో ఈ ఎస్టేట్‌ను బ్రిటిష్ వారు తీసుకొని తమకు అనుగుణముగా వుండే ఓ కొత్త మునసబుదార్ ను నియమించింది. అతడు స్థానిక అధికారులతో, పోలీసులతో చేతులు కలిపి ముఠాదార్ల భూములను ఆక్రమించుకున్నాడు. దీనికి తోడు వలస ప్రభుత్వము కొత్త చట్టాలను తీసుకువచ్చింది. దాని ప్రకారం అడవిలో కర్రలు కొట్టకూడదు, పశువులను మేపుకోకూడదు. అడవి సరుకులను ప్రభుత్వమే తీసుకుంటుంది. పోడు వ్యవసాయము నిషేధించారు. గొడ్డలి పన్ను విధించారు. పోడు వ్యవసాయం అంటే అడవిని శుభ్రం చేసి, చెట్లను నరికి వ్యవసాయ క్షేత్రముగా మార్చడం. కల్లు గీతను వేలం వేసి “కల్లు గీతపై ” “చిగురు పన్ను” “మొదలు పన్ను” విధించారు. పోలీసులు కూడా ఈ ప్రజలను దోచుకోవడం ఇబ్బందులు పెట్టడం ప్రారంభించారు.

గిరిజనులు ప్రత్యేక సంప్రదాయం కలిగి వుంటారు. వారి వ్యవహారాల్లో ఎవరైనా జోక్యం చేసుకుంటే సహించలేరు, తిరగబడతారు. బ్రిటిష్ వారి ఆగడాలను సహించలేర్ సుమారు 40 గిరిజన ఉద్యమాలు జరిగాయి, వాటిలో 1774-79 మధ్య హబ్బా కొండా జాతి వారు చత్తీస్ గఢ్ బస్తర్ జిల్లా లో “దొంగర్” గ్రామంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా తమ పరిరక్షణ కోసం మొదటి గిరిజన తిరుగుబాటు జరిగింది. తరువాత “రంప” ప్రాంతం లో “కరమ్ తమ్మన్న దొర” నాయకత్వంలో రంపా తిరుగుబాటు జరిగింది.

కరమ్ తమ్మన్న దొర బండపల్లి గ్రామానికి చెందిన “కోయ” ముత్తాదార్ ఇతనికి ‘ కొన్ని మానవాతీత శక్తులున్నాయని ప్రచారం ఉండేది. బ్రిటిష్ ఆంక్షలను సహించలేక, కొత్త చట్టాలను వ్యతిరేకిస్తూ ఇతర ముఠాదార్లయిన పులికంటి సాంబయ్య, ద్వారబందాల చంద్రయ్య, అంబుల్ రెడ్డి మొదలయిన వారి సాయం తీసుకొని మొదట ముప్పై మందితో ఒక చిన్న సైన్యాన్ని ఏర్పాటు చేసాడు. 1840లో ఒక పోలీస్ పార్టీ పై దాడి చేసి 12 మంది పోలీసులను హతమార్చాడు. మరో 20 మంది పోలీసులను గాయపర్చాడు. 8 సంవత్సరాలు (1840-48) మన్యం వీరుడుగా వెలుగొందాడు. తరువాత 1848లో తమ్మన్న దొర కన్పించకుండా వెళ్ళిపోయాడు.

1879లో తమ్మన్న దొర తిరిగి వచ్చాడు. ప్రజల్లో నూతన చైతన్యం పెల్లుబికింది.1848లో వెళ్ళిపోయిన తమ్మన్న దొరే తిరిగి వచ్చాడని ప్రచారం జరిగింది. మార్చి 10, 1879లో చోడవరం పోలీస్‌స్టేషన్‌పై దాడి జరిగింది, కొందరు పోలీసులను బందీలుగా తీసుకువెళ్లాడు. వారిలో షైక్ తన్ని అనే హెడ్ కానిస్టేబుల్ కొండప్రాంత ప్రజలనుండి 60 రూపాయలు లంచంగా తీసుకున్నట్లు అంగీకరించాడు. మరొక కానిస్టేబుల్ స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించాడనే కారణంగా మార్చి 13 న ఆ ఇద్దరి తలలు నరికాడు, తమ్మన్న దొర.

1880 లో తమ్మన్న దొర మలకన్ గిరి ప్రాంతానికి తన మకాం మార్చాడు. ఏప్రిల్ 24, 1880లో “పొడే” పోలీస్ స్టేషన్ పై దాడి చేసాడు. ఆ ప్రజలు “మలకన్ – గిరి రాజు”గా ప్రకటించారు. తిరుగుబాటు కొండప్రాంతంలో ఐదు వేల చదరపు మైళ్ళ ప్రాంతం లో జరిగింది. ప్రభుత్వం ఈ తిరుగుబాటును అణచివేయడానికి పెద్ద ఎత్తున సైన్యాన్ని సమాయత్తం చేయాల్సి వచ్చింది. తమ్మన్న దొర కు సాయం చేస్తున్నాడనే కారణంగా పులికంటి సాంబయ్యను నిర్బంధించారు పోలీసులు. దానికి ప్రతీకారంగా చంద్రయ్య అడ్డతీగల పోలీస్ స్టేషన్ తగలబెట్టాడు. సైన్యం ఏజెన్సీ ప్రాంతంలో ప్రవేశించింది. సర్ విలియన్ అనే ఆంగ్లేయ అధికారిని ఆ ప్రాంతం సందర్శించి తిరుగుబాటు కారణాలను తెలుసుకుని ఓ రిపోర్ట్ ను ఇవ్వవలసినదిగా ప్రభుత్వం నియమించింది. ఈ నియామకాన్ని వ్యతిరేకిస్తూ జులై 10న అంబుల్ రెడ్డి నాయకత్వంలో వడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పై దాడి చేసారు. ప్రభుత్వం వెంటనే సైన్యాన్ని అక్కడకు తరలించి అంబుల్‌రెడ్డిని నిర్బంధించింది. దీనికి ప్రతీకారంగా తమ్మన్న దొర కొన్ని గ్రామాలను కొల్లగొట్టాడు.

జులై 25, 1880 లో తమ్మన్న దొరను పోలీసులు చాకచక్యంగా పట్టుకొని కాల్చి చంపారు.