
శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీముఖలింగంలోని అష్టతీర్థ ఘట్టాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. దక్షిణ కాశీగా పిలువబడే ఈ క్షేత్రంలో 2017 జులైలో ఎనిమిది రోజుల పాటు వైభవంగా నిర్వహించిన అష్టతీర్థ రాజమహాయోగం నిర్వహించారు. ఆ ఉత్సవాలు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి సైతం లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఎనిమిది తీర్థ ఘట్టాల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. అప్పట్లో స్నానఘట్టాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.36 లక్షలు మేర ఖర్చు చేసింది. ఉత్సవాల అనంతరం వాటిని గాలికొదిలేశారు. కాలక్రమేణా అవి రూపురేఖలు కోల్పోయాయి. ప్రస్తుతం శ్రీముఖలింగేశ్వరుడిని దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నవారంతా తీర్థ ఘట్టాలు చూసి నివ్వెరపోతున్నారు. క్షేతాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.
ఎక్కడికక్కడ ఇదీ పరిస్థితి..
అప్పుడు బాగానే ఉండేది…
మేము అష్టతీర్థ రాజమహాయోగం జరిగిన సమయంలో మూడో రోజు పుణ్యస్నానం ఆచరించాం. అన్ని తీర్థ ఘట్టాలను చూశాం. ఆ రోజుల్లో భక్తులతో తీర్థ ఘట్టాలన్నీ కిటకిటలాడాయి. పరిసరాలు కూడా శుభ్రంగా కనిపించాయి. ఇప్పుడు స్వామి దర్శనానికి వచ్చి చూస్తే తీర్థఘట్టాలు పనికిరాని మొక్కలతో నిండిపోయాయి. అధికారులు క్షేత్రం అభివృద్ధిపై దృష్టి సారిస్తే బాగుంటుంది.
-మీనాక్షి, భక్తురాలు, విశాఖపట్నం
ప్రతిపాదనలు పంపించాం..
శ్రీముఖలింగేశ్వరస్వామి క్షేత్రం బృహత్ ప్రణాళికలో భాగంగా అష్టతీర్థ ఘట్టాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. ఆ మేరకు రూ.55 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించాం. నిధులు మంజూరైన వెంటనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం.– పి.ప్రభాకరరావు, ఆలయ ఈవో, శ్రీముఖలింగం





