
కాకినాడ జిల్లాలోని అమలాపురం టౌన్‌లో స్థానిక నల్లా వీధిలో ఓ వ్యాన్‌లో మూడు ఆవులను అక్రమంగా రవాణా చేసేందుకు ఇద్దరు వ్యక్తులు శుక్రవారం ఉదయం ప్రయత్నిస్తున్న సమయంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగదళ్ కార్యకర్తలు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు నల్లా వీధికి చేరుకుని ఆవుల యాజమానులపై విచారణ జరిపారు. తాత్కాలికంగా ఆ మూడు ఆవులను స్థానిక గోశాలకు తరలించారు. ఆవులను అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారిద్దరూ ఆవులను రామచంద్రపురం తీసుకుని వెళుతున్నామని కొద్దిసేపు. ద్రాక్షారామ తరలిస్తున్నామని మరికొద్ది సేపు పొంతన లేని సమాధానాలు చెప్పారు. పట్టణ సీఐ క్రిష్టోఫర్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. బజరంగ దళ్ రాష్ట్ర సహ కన్వీనర్ శిరంగు నాయుడు, విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు ఊటుకూరి సాంబయ్య, కర్రి పార్ధసారధి, మేడిశెట్టి సతీష్, పిచ్చుక సుబ్బారావు ఆవుల అక్రమ రవాణాపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.





