
శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా అయినప్పటికీ 329 మంది పురుషులు, 5గురు మహిళామూర్తులు “ స్వాతంత్రోద్యమంలో పాల్గొని కారాగార శిక్షలు అనుభవించారు. వీరిలో “శశిమాను గున్నమ్మ” రైతు కుటుంబం నుండి వచ్చారు, మందసా వాసి, నిండు గర్బిణీ అయినప్పటికీ పోలీసులు కాల్చిచంపారు. గున్నమ్మ 1914లో గుడార రాజా మణిపురంలో ఓ పేద రైతు కుటుంబలో జన్మించారు. రెక్కాడితే గాని డొక్కాడని దుర్భర జీవితంలో గున్నమ్మ పెరిగింది. నిండు గర్భిణిగా వున్న సమయంలో యుక్త వయస్సులోనే భర్త మాధవయ్యను భౌతికంగా కోల్పోయింది. అయినా గుండె నిబ్బరంతో జీవితాన్ని నెట్టుకొస్తున్నది. చేదు అనుభవాలు జీవిత సవాళ్ళను ఆమె ధైర్యంగా ఎదుర్కొంది.
మందస ఓ జమిందారీ ప్రాంతం, గున్నమ్మ పుట్టిన గుడార రాజమణిపురం ఈ జమిందారీలోని గ్రామమే. 1940లో దీనికి జమిందార్ జగన్నాధరాజమణి, ఇతని దివాన్ రామకృష్ణదేవ, వీరు ప్రజలపై అనేక పన్నులు విధించి ఖజానా నింపుకొనేవారు. వాటిలో ముఖ్యంగా “భూమి పన్ను “పండిన పంటలో మూడవ వంతు వసూలు చేస్తూ ఉండటం. మందస దగ్గర్లో “ఆరుక్కమెట్లు” అనే అటవీ ప్రాంతం వుంది. ప్రజలు ఆ అటవీ సరకులను పోగుచేసుకొని అమ్ముకోవడం, కలపను వంటచెరకు గా అమ్ముకోవడంద్వారా వచ్చే డబ్బుతో జీవనోపాధిని వెళ్లదీసేవారు. ఈ లోగా బ్రిటిష్ వారు అటవీ సంపద వినియోగంపై ఆంక్షలు విధించారు.
1940 మార్చి 27, 28 తేదీల్లో పలాసలో పెద్ద ఎత్తున అఖిల భారత రైతు మహా సభ జరిగింది. ఈ సభలో శ్రీ ఎన్ జి రంగా, టంగుటూరి ప్రకాశం పంతులు, సర్దార్ గౌతు లచ్చన్న, గానుగుల తరుణాచారి, బిందాళం గవరయ్య, సర్దార్ మార్పు పద్మనాభం పాల్గొన్నారు. ఈ సభ జమిందారీ వ్యతిరేక ఉద్యమానికి కొత్త ఊపునిచ్చింది.

గుడార రాజా మణిపురంలో కిసాన్ సభను రైతులు నిర్వహించారు, చుట్టుపక్కల గ్రామాల నుండి రైతులు, మహిళలు హాజరై దాన్ని విజయవంతం చేశారు. ఈసభలో రైతునాయకుడు సర్దార్ మార్పు పద్మనాభం జమీందారీ వ్యవస్థపై ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఈ సభలో క్రియాశీలకంగా పాల్గొన్న శిశుమాను గున్నమ్మ కూడా రైతులను ఉత్తేజితులను చేసింది. ఈ సభ ఓ సాధారణ స్త్రీని వీరనారిగా మార్చింది. ఆమె ఈ సభలో ప్రభుత్వ ఆంక్షలను ధిక్కరించాలని పిలుపునిచ్చి కార్యాచరణను రూపొందించింది.
మందస ప్రాంతంలోని అడవికి నూరు ఎడ్ల బండ్లతో వెళ్లి కలప నరికి బండ్లపై వేసుకురావడానికి నిర్ణయం జరిగింది. ఆ మరుసటి రోజు గున్నమ్మ నాయకత్వంలో మా అడవిలో కలప నరికి బండ్లకు ఎక్కించారు. విషయం తెలుసుకున్న మందస జమిందార్ జగన్నాధ రాజమణి బెంబేలెత్తిపోయారు. రైతుల తిరుగుబాటున్న అణచివేయమని దివాన్ రామకృష్ణ దేవ్ కు, ఫారెస్ట్ రేంజర్ కృష్ణ చంద్ర రాజుకు హుకుం జారీ చేసాడు. ఆపడానికి ఎంత ప్రయత్నించినా గున్నమ్మ నాయకత్వం లో కలపను తీసుకుపోయారు.
1940 మార్చి 30 రాత్రి గున్నమ్మకు రాజమణిపురంలో అభినందన సభను ఏర్పాటు చేసి ఆమె ధైర్య సాహసాలను కిసాన్ నాయకులు ప్రశంసించారు. గోపిసుందర గాంతాయత్ నాటి పోలీస్ ఇన్సపెక్టర్, గున్నమ్మ కలపను తీసుకువెళ్లడాన్ని సహించలేకపోయారు, ఓ పది మంది పోలీసులను తీసుకొని రాజమణిపురం గున్నమ్మ వద్దకు వెళ్లి కలపను స్వాధీనపరచమని గద్దించాడు. రైతుల ఆవేశం, ముఖాల్లోని ఉద్రిక్తతను చూసి వెనుదిరిగారు. పరిస్థితిని తెలుసుకున్న జమిందార్ ఆందోళనలో అల్లాడిపోయాడు. జిల్లా ఎస్.పి, సబ్ కలెక్టర్, పోలీస్ సర్కిల్, సోంపేట మెజిస్ట్రేట్ పోలీస్ బలగంతో తుపాకులు చూపుతూ జనంలోనికి ప్రవేశించారు. కదిలితే కాల్చేస్తాం అని బెదిరించడంతో ఈటెలు, బల్లేలతో రైతులు యుద్ధానికి సిద్ధమయ్యారు.

ఈ లోగా పోలీసులు గూడెన నరసింహులు, గొర్లె దాలిబందు, గొర్లె జంగాలు నెయ్యిల మంగళ, గొర్లె చంద్రయ్య, గొర్లె కర్రెన్నలతో సహా 42 మంది చేతులక బేడీలు వేసి వ్యాను ఎక్కించారు. పోలీసు వాహనం కదలనివ్వకుండా దానికి అడ్డంగా రైతులు పడుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన గున్నమ్మ “రైతులకు బేడీలు వేసి చెరలో పెట్టడానికి మీకు ఎన్ని గుండెలురా” అని గర్జించి వాహనానికి అడ్డు నిలిచిండి గున్నమ్మ గుండెకు తుపాకులు గురిపెట్టి ప్రక్కకు తప్పుకోవాలని పోలీస్ అధికారులు హెచ్చరించారు, కానీ గున్నమ్మలో ఏ మాత్రం పట్టు సడలలేదు.”నా గొంతులో ప్రాణమున్నంతవరకూ నా రైతులను బందీలుగా తీసుకుపోనివ్వనని” మొండికేసింది. ఓ కానిస్టేబుల్ తుపాకి ముందుభాగంతో ఆమె రొమ్ముమీద పొడిచాడు, గాయమయ్యింది. అంతలోనే మరో వైపు నుండి తుపాకీ గుండు ఆమె పొట్టలోకి దూసుకుపోయింది. ఆమె అప్పుడు నిండు గర్బిణి. కేకలు, అరుపులు, తుపాకీ శబ్దాలు మిన్నుముట్టాయి. 1940 ఏప్రిల్ ఒకటవ తారీకు సాయంత్రం 6.30 నిమిషాలకు పోలీసులు గుళ్లవర్షం కురిపించారు. గున్నమ్మ వీరమరణం పొంది, జిల్లా రైతాంగ ఉద్యమ చరిత్రలో సుస్థిర స్థానం పొందింది.
గున్నమ్మ పోరాట స్పూర్తి గాధ నేటికీ ఉత్తరాంధ్ర పల్లెల్లో జముకుల కధగా గానం చేస్తూ వుంటారు. ఆ విధంగా ఆ తల్లి త్యాగమయిగా ఉత్తరాంధ్ర పల్లె జనం గుండెల్లో కొలువుదీరింది. గుడార రాజమణిపురం నేడు వీరగున్నమ్మ రాజమణిపురం గా మార్చారు. 1988 సెప్టెంబర్ 10 న ప్రభుత్వం ఓ స్తూపాన్ని గున్నమ్మ జ్ఞాపకార్ధం నిర్మించారు. తెలుగింటి ఆడపడుచుల తెగువకు ప్రతిరూపంగా వీర గున్నమ్మ చరిత్ర చరితార్ధమయ్యింది.





