ArticlesNews

రామరాజ్యం బోధిస్తున్న రాజధర్మం

282views

ఎప్పటి త్రేతాయుగం… ఎప్పటి రాముడు… నేటికీ దేశంలో రామమందిరం లేని ఊరు, పూజా మందిరంలో రాముడు లేని గృహం ఉండవు. యుగయుగాలకు రాముడు ఎందుకంత ఆదర్శప్రాయుడయ్యాడు? రామో విగ్రహవాన్‌ ధర్మః. రాముడు ధర్మ స్వరూపుడని రాక్షసుడైన మారీచుడే చెప్పాడు. వ్యక్తి ధర్మాలను ఎలా ఆచరించాలో మానవ లోకానికి చూపించిన మర్యాదా పురుషోత్తముడు- రాముడు. అయోధ్య రామమందిర ప్రారంభ శుభ ఘడియల్లో శ్రీరామచంద్రుడి మూర్తిని కొలుద్దాం… ఆ ఆదర్శమూర్తి స్ఫూర్తిని తలుద్దాం!

రామాయణం అంటే రాముడి ప్రయాణం. అది ధర్మపథం. మానవ జీవితంతో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్న మహాకావ్యం ‘రామాయణం’. రాముడు పరిపూర్ణ మానవుడు. మనిషికి ఉండాల్సిన అన్ని సుగుణాలకు ప్రతిరూపం. మానవుడిగా పుట్టాడు, పెరిగాడు, కష్టాలు పడ్డాడు. కానీ ఏ సందర్భంలోనూ ధర్మాన్ని తప్పలేదు. ఆదర్శ-పుత్రుడు, ఆదర్శ-శిష్యుడు, ఆదర్శ-భర్త, ఆదర్శ-సోదరుడు, ఆదర్శ-స్నేహితుడు, ఆదర్శ రాజుగా లోకారాధ్యుడు అయ్యాడు. మానవ జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగింది శ్రీరామావతారం. అందుకే ‘రామ’నామం హిందువుల రోమరోమానా ఇమిడిపోయింది. సాటివారి పట్ల గౌరవం, తోటివారి అభిప్రాయాలకు విలువివ్వడం రాముడిలోని గొప్ప సుగుణం. రావణుడితో విభేదించిన విభీషణుడు శ్రీరాముడి శరణు కోరి వస్తాడు. తనను అభ్యర్థించిన వారికి రాముడు నేరుగా అభయం ఇవ్వలేదు. జాంబవంతుడు, సుగ్రీవుడు, అంగదుడు, ఆంజనేయుడు, శరభుడు వంటివారిని పేరుపేరునా అభిప్రాయాలు కోరాడే తప్ప- తాను చెప్పిందే చేయాలనే అహం అణువంతైనా చూపలేదు. ప్రతి విషయంలో ప్రజాభిప్రాయాన్ని మన్నించేవాడు.

పితృవాక్య పాలన
రాజుగా ప్రజాజీవితంలోకి వచ్చే వారికి ఎలాంటి కళంకం ఉండరాదనే సీతమ్మతో అగ్నిప్రవేశం చేయిస్తాడు. క్లిష్ట సమయాల్లోనూ ధర్మాన్ని వీడలేదు కాబట్టే పూజనీయుడయ్యాడు. కిష్కింధ రాజు వాలి…మహాబలశాలి. వివిధ సందర్భాల్లో రావణాసురుడిని చావగొట్టి బంధిస్తాడు. అంతటి బలమైన వాలితో స్నేహం చేసి ఉంటే రావణుడిని నాలుగు తన్ని సీతను తెచ్చి రాముడికి అప్పగించేవాడు. ఆ మాటే వాలి చనిపోతూ రాముడితో చెబుతాడు. కానీ అతడు అధర్మపరుడు కాబట్టి శ్రీరాముడు స్నేహం చేయలేదు. బలహీనుడైనా సరే అతడి తమ్ముడు సుగ్రీవుడితో స్నేహం చేసి తన కార్యాన్ని సాధించుకున్నాడు. కిష్కింధ, లంక రాజ్యాల రాజులను ఓడించాడు రాముడు. సహజంగా ఓడినవారి రాజ్యం గెలిచినవారి వశం అవుతుంది. కానీ కిష్కింధను సుగ్రీవుడికి, లంకను విభీషణుడికి అప్పగించాడు. రాజ్యకాంక్ష, పరులసొత్తుపై వ్యామోహం వంటి దుర్గుణాలు మనిషికి ఉండకూడదని ఆచరించి చూపాడు. మాటపై నిలబడటం ఆయనలోని అద్భుత లక్షణం. రాముడికి వనవాసం గురించి తెలిపినప్పుడు దశరథుడు ఒక మాట అంటాడు. వృద్ధుడైన తనను ఖైదు చేసి రాజ్యాన్ని స్వీకరించమని ప్రాథేయపడతాడు. దశరథుడు చేసింది అక్రమమని, ఆయన్ని చెరసాలలో పెడతానని లక్ష్మణుడు అంటాడు. ‘తండ్రి మాటే కాదు, తల్లి మాటా శిరోధార్యం’ అని కౌసల్య అంటుంది. ఎందరు చెప్పినా పితృవాక్యపాలనకే కట్టుబడ్డాడు. ‘నీకైనా, నాకైనా, ప్రజలకైనా ప్రభువు దశరథుడు. ఆయన మాటే మనందరికీ శిరోధార్యం’ అంటాడు రాముడు. తల్లి, తండ్రి చెరోమాటా చెబితే- పితృవాక్య పాలనే శిరోధార్యం. ‘నేను తల్లి మాట విని ఆగిపోతే మన వంశంలో తండ్రి మాట విన్నవాళ్లు అవివేకులు అవుతారు. నేను వారిని అవమానించకూడదు. తండ్రి మాట విని వనవాసానికి వెళతాను’ అని రాముడు తల్లికి ధర్మాల గురించి చెబుతాడు. రాజు కాబోయిన తనను అడవులకు పంపారని పరనింద చేయలేదు. పైగా కైకేయిని జాగ్రత్తగా చూసుకొమ్మని చెబుతాడు. శ్రీరాముడు ఎన్నడూ అసత్యం ఆడి ఎరుగని సత్యవాక్పాలకుడు. ఎవరికీ సాధ్యం కాని శివ ధనుస్సును ఎక్కుపెట్టినప్పుడు- తాటకి, సుబాహుల రాక్షస సంహారం చేసినప్పుడు… తన పరాక్రమం గురించి చెప్పుకోలేదు. తాను గొప్ప వీరుడైనా శాంతిని కాంక్షించాడు. హనుమంతుడిని రావణుడి వద్దకు దూతగా పంపాడు తప్ప, యుద్ధానికి కాలు దువ్వలేదు. ఆత్మస్తుతి, పరనింద మచ్చుకైనా లేని సుగుణాభిరాముడు.

మనకు ఉపకారం చేసినవారికి అపకారం తలపెట్టడం మహాపాపమని రామాయణం చెబుతుంది. ఎలాంటి పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉంది కానీ, కృతఘ్నతకు లేదంటాడు రాముడు. కృతజ్ఞతా భావానికి ఆయన నిలువెత్తు నిదర్శనం. వారధి నిర్మాణంలో సాయపడిన ఉడుత నుంచి రావణుడి చేతిలో మరణించిన జటాయువు వరకు ఎంతో కృతజ్ఞతను చాటాడు. జటాయువు తన కోసం మరణించిందని రాముడు విలపిస్తాడు. ఆతిథ్యమిచ్చిన శబరిని చల్లని నదీమతల్లివై మానవాళిని తరింపజేస్తావంటాడు. యుద్ధంలో సుగ్రీవుడు గాయాల పాలైనప్పుడు తన కారణంగా మిత్రుడు క్షతగాత్రుడయ్యాడని దుఃఖిస్తాడు. రావణసంహారం తరవాత దేవేంద్రుడు వరం కోరుకొమ్మని అడగ్గా- తన కోసం యుద్ధంలో మరణించిన వానరులను బతికించమంటాడు. సీతమ్మ జాడ కనిపెట్టడాన్ని స్వామికార్యంగా హనుమ భావిస్తాడు. కానీ అది మహోపకారమంటూ రాముడు గాఢాలింగనం చేసుకుంటాడు. రావణసంహారంలో సాయపడిన ప్రతి ఒక్కరినీ సత్కరించి కృతజ్ఞత చాటుతాడు. రావణుడిని రణరంగంలో తొలిసారి చూసినప్పుడు దశకంఠుడి తేజస్సును మనస్సులోనే ప్రశంసిస్తాడు. సీతాపహరణానికి పాల్పడకపోతే దేవలోకాన్ని కూడా ఏలేవాడేమో అనుకుంటాడు. క్షమాపణ కోరి సీతను విడిచిపెడితే రావణుడిని క్షమించడానికీ సిద్ధపడతాడు. రావణుడు చనిపోయాక అంతిమ సంస్కారాలు చేయడానికి విభీషణుడు ఇష్టపడడు. కానీ రాముడు ఒప్పుకోడు. రావణుడి మరణంతో వైరం తీరిపోయిందని అంత్యేష్టి సంస్కారాలు చేయిస్తాడు.

ఆదర్శ మూర్తి
రాజధర్మం విషయంలో రాముడు ఆదర్శమూర్తి కనుకే రామరాజ్యాన్ని నేటికీ గుర్తుచేసుకుంటాం. వనవాసంలో ఉన్న రాముడిని వెతుకుతూ ఓసారి భరతుడు అడవికి వెళ్తాడు. రాజ్యపాలన, రాజధర్మాల గురించి భరతుడిని అనేక ప్రశ్నలు వేసి ధర్మోపదేశం చేస్తాడు. పాలకుడు గురువులను రాజనీతిజ్ఞులను ఆదరించాలి. రాజుకు వ్యక్తిగత క్రమశిక్షణ చాలా అవసరం. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తే, కాలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. చక్రవర్తికి కళ్లూ చెవులూ సచివులే. అసమర్థుల్ని ఎంచుకుంటే తన కన్ను తాను పొడుచుకున్నట్టే. విశ్వాసపాత్రులతోనే మంత్రాంగం జరపాలి. న్యాయవ్యవస్థ బలంగా ఉంటేనే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయి. శాంతి భద్రతలు కరవైనచోట, జనం ప్రభువును గౌరవించరు. పన్నులు జనం భరించలేనంతగా ఉండకూడదు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పరాదు. అసత్యం పలకకూడదు. పొగడ్తలకు పొంగిపోరాదు. ఇంద్రియాలకు లొంగిపోకూడదు. రాజుననే అహం ప్రదర్శించకూడదు. ఎప్పుడు చేయవలసిన పనిని అప్పుడే చేసేయాలి. అపరాధులను నేరం రుజువయ్యాకే శిక్షించాలి. రాజు, మంత్రులు, సేనాపతులు, ఉద్యోగులంతా ధర్మబద్ధులై సత్యవర్తనులై ఉండాలి. వారు రుజుమార్గంలో ఉంటేనే ప్రజలు సత్యమార్గంలో నడుస్తారు. ఇదీ, సంక్షిప్తంగా శ్రీరాముడు భరతుడికి చెప్పిన రాజనీతి. రామమందిర ప్రతిష్ఠ సందర్భంగా రామపథంలో నడవడమే నిజమైన రామభక్తి!

ధర్మాచరణ
ధర్మాచరణలో రాముడు భేదాలు చూపలేదు. సీతమ్మను ఉద్దేశించి పౌరుడు తప్పుగా మాట్లాడినప్పుడు ఆమెను వాల్మీకి ఆశ్రమానికి పంపే సందర్భంలో… ‘సీత నా ప్రాణం. సీతకన్నా, నా ప్రాణంకన్నా, సోదరుడికన్నా అన్నింటికన్నా ధర్మం, వంశగౌరవం గొప్పవి’ అని లక్ష్మణుడితో అంటాడు. అవతార పరిసమాప్తి గురించి చెప్పడానికి యమధర్మరాజు మహర్షి రూపంలో రాముడిని కలవడానికి వస్తాడు. ఎవరు ఆటంకం కలిగించినా మరణదండన విధించాలని యముడు షరతు పెడతాడు. రాముడు సరేనని తన ప్రతిజ్ఞ గురించి లక్ష్మణుడికి చెప్పి గది బయట కాపలా పెడతాడు. అంతలో దూర్వాస మహర్షి వచ్చి లోపలికి పంపకపోతే ఇక్ష్వాకు వంశమే నాశనమయ్యేలా శపిస్తానంటాడు. వంశక్షయం కంటే తానే శిక్షను అనుభవిస్తానని లక్ష్మణుడు రామదర్శనానికి దూర్వాసుణ్ని అనుమతిస్తాడు. తన ప్రతిజ్ఞ మేరకు లక్ష్మణుడికి శ్రీరాముడు మరణదండనతో సమానమైన దేశబహిష్కరణ విధిస్తాడు. రాముడిని వీడి ఉండలేని లక్ష్మణుడు సరయూ నదిలో ప్రాణత్యాగం చేస్తాడు.

పోచిరాజు శ్రీరామ్‌మూర్తి